న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన అమెరికాను కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేస్తోంది. తక్కువ సమయంలోనే అమెరికాలోని వివిధ రాష్ట్రాలపై విరుచుకుపడటంతో అక్కడి వైద్య సిబ్బంది అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. డాక్టర్లు, నర్సులు కరోనా చికిత్సకు అవసరమైన వైద్యపరికరాలు, స్వీయ రక్షణ కోసం వినియోగించే సామాగ్రి కొరతతో అవస్తలు పడుతున్నారు.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల 22 వేల మందికి ఈ వ్యాధి సోకగా, 34 వేల మంది మృతిచెందారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. మొత్తం 1లక్ష 42 వేల కేసులు నమోదవ్వగా, 2484 మంది మృత్యువాతపడ్డారు. ఇంకా ఏమరపాటుగా ఉంటే, రానున్న రోజుల్లో ఒక్క అమెరికాలోనే 10 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికాలో 59,648 కరోనా కేసులతో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవగా, 13 వేల కేసులతో న్యూ జెర్సీ, 6వేలకు పైగా కేసులతో కాలిఫోర్నియా తదుపరి స్థానాల్లో నిలిచాయి.
న్యూయార్క్‌లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు అక్కడి ప్రజలకే కాకుండా వైద్య సిబ్బందికి కునుకులేకుండా చేస్తున్నాయి. కరోనా బాధితుల సంఖ్యకు తగ్గా వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవడంతో జీవితంలోనే అత్యంత కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నామని బ్రూక్‌డేల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో పనిచేస్తున్న ఫిజీషియన్ డా. అరబియా మోల్లెట్టే తెలిపారు. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఓ మెడికల్ వార్‌జోన్‌గా తలపిస్తుందని అక్కడి పరిస్థితులను వివరించారు. వైద్యుల కొరతతో షిప్టుసమయం ముగిసినా గంటల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని పదేళ్లకుపైగా అనుభవం ఉన్న డా. అరబియా అన్నారు.
‘ఇక్కడి పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఇక్కడి కొచ్చే వారి ఆరోగ్యం కోసమే కాదు. మాకు కూడా ఆ వైరస్ సోకకుండా అనునిత్యం యుద్ధం చేస్తూనే ఉండాలి. పేషెంట్ల తాకిడి పెరగడంతో ఆక్సిజన్ ట్యాంకులు, వెంటిలేటర్లు, ఆఖరికి నిల్చోవడానికి స్థలం కూడా కరువైంది. ఇక్కడికి వచ్చే ప్రతి కరోనా బాధితున్ని చూస్తుంటే, నాకు మా కుటుంబం జ్ఞప్తికి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ వృత్తిని కూడా వదిలేసి వెళ్లాలనిపిస్తోంది. ఇక్కడ పరిస్థితులను చూస్తుంటే వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడిందేమో అనే అనుమానం కలుగుతోంది. కరోనా వ్యాధి తొలుత వ్యాపించిన సమయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఈ వ్యాధి కేవలం వృద్ధులకు, లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికే హానికరమని భావించాము. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, యువకులు కూడా ఈ వ్యాధితో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవడం చూస్తున్నాము. జాగ్రత్తలు పాటించినా, చిన్న ఏమరపాటుతో ఈ వ్యాధి వైద్యసిబ్బందికి కూడా ఎక్కువగా సోకడం బాధకలిగిస్తోంది' అని డా. అరబియా తెలిపారు. కొందరైతే కరోనా బారిన పడిన వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రి ముందే వదిలేసి వెళుతున్నారని అదే ఆసుపత్రిలో పని చేసే నర్సు తెలిపారు. ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులను తలచుకుని అక్కడ పనిచేస్తున్న వైద్యులు, నర్సులు కన్నీటి పర్యంతమయ్యారు.
'కరోనా బాధితులకు చాలా దగ్గరగా ఉంటూ పరీక్షలు చేస్తున్నాను. ఇక్కడ మాస్కులు లేకపోవడంతో న్యాప్కిన్లు మొహానికి అడ్డుపెట్టుకుంటున్నాము. చివరకు ఆసుపత్రి వర్గాలు కూడా మాస్కులు ఉంటే సహాయం చేయండంటూ ఓ బాక్సును ఆసుపత్రి ముందు ఉంచారంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవొచ్చు. నా పిల్లలు కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని నా భర్త ఈ ఉద్యోగాన్ని వదిలిరమ్మంటున్నాడు. ఒకవేళ నాకు ఈ వ్యాధి సోకితే, నా నుండి నాకుటుంబానికి వ్యాప్తి చెందుతుందనే ఆలోచనే నన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది' అని వాషింగ్టన్‌లో ఓ ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment