అరుదైన సీతాకోకచిలుకలను చంపేశాడని..
లండన్: సీతాకోకచిలుకలను చంపిన కారణంగా ఓ వ్యక్తికి జైలుశిక్ష విధించారు. ఈ ఘటన యూకేలోని బ్రిస్టల్ నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఫిలిప్ కల్లన్ అనే వ్యక్తి గత నెలలో అంతరించిపోతున్న జాతికి చెందిన రెండు అరుదైన నీలిరంగు సీతాకోకచిలుకలను పట్టుకున్నాడు. అనంతరం వాటిని నలిపి చంపేశాడు. ఈ విషయాన్ని రిజర్వ్ అధికారులు పోలీసులకు తెలిపారు. వారు ఫిలిప్ కల్లన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా.. తాను సీతాకోకచిలుకలను చంపినట్లు ఫిలిప్ అంగీకరించాడు. ఇది చాలా అరుదైన కేసు అని, నిందితుడు తప్పు ఒప్పకున్నందుకు అతడికి జైలు శిక్ష విధిస్తూ.. 250 గంటలపాటు సేవ చేయాలని మేజిస్ట్రేట్ తీర్పిచ్చారు. 300 పౌండ్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించడంతో పాటు మూడు అరుదైన రిజర్వ్ లలోకి అనుమతించకుండా నిషేధం విధించారు. ఈ అరుదైన జాతి సీతాకోకచిలుకలు 1979లో బ్రిటన్ లో దాదాపు అంతరించిపోయాయి. 1983లో స్వీడన్ నుంచి దిగుమతి చేసుకుని కాపాడుతున్నారు. మార్కెట్లో వీటిని అక్రమంగా 300 పౌండ్లకు విక్రయిస్తుంటారని అధికారులు వివరించారు.