కైమెరిజం వ్యాధితో బాధపడుతున్న మోడల్ టెయిలర్ ముహుల్
కాలిఫోర్నియా : మోడల్‌గా రాణించాలంటే మంచి శరీరాకృతితో పాటు మేని ఛాయా కూడా ముఖ్యమే. కానీ ఒకే మనిషి ఒంటి మీద రెండు వేర్వేరు రంగులు ఉంటే...వాళ్లు మోడల్‌గా రాణించడం సాధ్యమేనా అంటే సాధ్యమే అంటుంది కాలిఫోర్నియాకు చెందిన మోడల్ టెయిలర్ ముహుల్. విషయమేమిటంటే ముహుల్ ఉదర భాగం మీద రెండు వేర్వేరు రంగులు ఉన్నాయి. అయినప్పటికి ఆమె మోడల్‌గా రాణిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ముహుల్ పుట్టుకతోనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతుంది.
పుట్టినప్పటి నుంచే ముహుల్ ఉదర భాగం రెండు వేర్వేరు రంగుల్లో ఉంది. ఎడమ భాగం కంటే కుడి భాగం చాలా ముదురు రంగులో ఉంటుంది. అంతేకాక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల బాల్యం నుంచే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. శరీరం ఇలా రెండు వర్ణాల్లో ఉండటం వల్ల చిన్నతనం నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అంతేకాక లేజర్ చికిత్స ద్వారా రంగును తొలగించుకోవాలని చూసింది, కానీ నొప్పి భరించలేక ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకుంది. శరీరం మీద ఇలా రెండు రంగులు ఉండటాన్ని అవమానంగా భావించేది. ఈ విషయం బయటకు కనిపిచకుండా ఉండేందుకు నిండుగా కప్పి ఉంచే బట్టలను ధరించేది.
అయితే ముహుల్‌కు యుక్తవయస్సు వచ్చిన తర్వాత డాక్టర్లు ఆమెను పరీక్షించి, ముహుల్ ‘కైమెరిజం’ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతుందని తెలిపారు. ఒకే మనిషి శరీరంలో రెండు జతల డీఎన్‌ఏలు కలిసిపోవడం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు. మొదట ముహుల్ తల్లి గర్భంలో రెండు పిండాలు అభివృద్ధి చెంది ఉంటాయని, అనంతరం అవి రెండు కలిసిపోయి ఒక్కటిగా మారి ఉంటాయని అందుకే ఇలా జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇలా రెండు రంగుల కలిగి ఉండటాన్ని అవమానంగా భావించిన ముహుల్ దాని వెనక ఉన్నకారణాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తన శరీరాన్ని దాచాలనుకోవడం లేదు. ఈ అరుదైన వ్యాధి గురించి అవగాహన కల్పించడం కోసం మోడలింగ్‌ను కెరియర్‌గా ఎంచుకుని, అందులో రాణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment