శరణార్థులకు ట్రంప్‌ షాక్‌ | Trump’s Order Blocks Immigrants at Airports, Stoking Fear Around Globe | Sakshi
Sakshi News home page

శరణార్థులకు ట్రంప్‌ షాక్‌

Published Sun, Jan 29 2017 2:50 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

శరణార్థులకు ట్రంప్‌ షాక్‌ - Sakshi

శరణార్థులకు ట్రంప్‌ షాక్‌

అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధం
ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరులకు 90 రోజులు వీసాల జారీ నిలిపివేత
►  శరణార్థుల పునరావాస కార్యక్రమం 120 రోజులు బంద్‌


వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం చెప్పింది చెప్పినట్లు ఆచరణలో పెట్టేస్తున్నారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదుల్ని అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకుంటామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై శనివారం సంతకం చేశారు. ఉత్తర్వు ప్రకారం అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశాన్ని నిరవధికంగా నిషేధించారు. ఇతర దేశాల శరణార్థుల్ని ఆసాంతం పరిశీలించాకే అనుమతిస్తారు. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్  పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. 

సిరియా వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యమిస్తారు.  సంతకం చేశాక ట్రంప్‌ మాట్లాడారు. ‘ఇస్లామిక్‌ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకువస్తున్నాం. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము కోరుకోవడం లేదు. అమెరికాకు మద్దతిచ్చే, ప్రేమించే ప్రజలే ఇక్కడకు రావాలని కోరుకుంటున్నాం’అని ట్రంప్‌ పేర్కొన్నారు. 9/11 దాడులు నేర్పిన పాఠాల్ని ఎప్పుడూ మరవకూడదని చెప్పారు. ‘విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న అనేకమందికి ఉగ్ర నేరాల సంబంధాలపై శిక్షలు పడ్డాయి. శరణార్ధి ఒప్పందంలో భాగంగా అమెరికాలోకి ప్రవేశించిన వారికీ నేరాలతో సంబంధాలు ఉన్నాయి’ అని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

నిర్ణయంపై నిరసనల వెల్లువ
ట్రంప్‌ సంతకంపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పలు దేశాల అధినేతలు తీవ్రంగా స్పందించారు. డెమొక్రటిక్‌ సెనెటర్‌ కమలా హారిస్‌ వ్యాఖ్యానిస్తూ... ‘హోలోకాస్ట్‌ (మారణహోమం) మెమొరియల్‌ డే’ రోజున ట్రంప్‌ సంతకం చేశారని, ఇది ముస్లింలపై నిషేధమేనని పేర్కొన్నారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం తనని కలచి వేసిందన్నారు.  ‘అనేక మంది అమెరికన్లలా నేనూ వలసదారుల వారసుడినే. అందుకు గర్వపడాలి. దేశానికి ప్రమాదం తలపెట్టే వారిపై మాత్రమే దృష్టి పెట్టాలి. శరణు కోరినవారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలి’ అని జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. అమెరికాకు ప్రతిభావంతుల్ని తీసుకురావడంలో ట్రంప్‌ నిర్ణయం అడ్డంకులు సృష్టిస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. ట్రంప్‌ ఆదేశాలతో తమ కంపెనీలో కనీసం 187 మంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పారు.    

భారత్‌పై  ప్రభావం ఉండదు
ట్రంప్‌ విధానాలు భారత్‌లోని ఐటీ, బయోటెక్, ఫార్మా పరిశ్రమలపై ప్రభావాన్ని చూపబోవని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్‌ అన్నారు. భారత్‌తో వాణిజ్య తరహా దృక్పథాన్ని అమెరికా కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement