ఇక ఏం చెప్పం.. నేను వెళ్లాకే తెలుస్తాయి: ట్రంప్
వాషింగ్టన్: మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొండివైఖరి బయటపడింది. ఆయన ఏ విషయాన్ని కాపీ కొట్టబోరని, మంచి విధానమే అయినప్పటికీ పాటించబోరని తాజాగా ఇచ్చిన ఆదేశాల ద్వారా మరోసారి స్పష్టమైంది. అధ్యక్ష భవనాన్ని ఎవరెవెరు సందర్శిస్తున్నారనే విషయాన్ని తాము ఇక నుంచి చెప్పబోమని తాజాగా ట్రంప్ చెప్పారు. ఈ విషయాన్ని అమెరికా వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్ సందర్శించిన వారి వివరాలు స్వచ్ఛందంగా తెలిపేవారని, ఆ విధానం తాము అమలుచేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. జాతీయ భద్రతా దృష్ట్యా, స్వేచ్ఛా భంగం కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా వివరించింది. అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే తెలుపుతారని, లేదంటే ట్రంప్ పాలన ఉన్నన్ని రోజులు చెప్పకుండా ఆయన పగ్గాలు వదిలేసిన తర్వాత మొత్తం ఎంతమంది వచ్చారు? వారెవరు అనే వివరాలు ప్రజలకు తెలియజేస్తారని వివరించింది. ఈ కొత్త విధానానికి ట్రంప్ పచ్చజెండా ఊపుతున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది.