వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సామాజిక మాధ్యమం ట్విటర్ మధ్య ట్వీట్‌ల వార్ కొనసాగుతోంది. బిగ్ యాక‌్షన్ ఉండబోతోంది అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్‌పై ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే స్పందించారు. ‘ఓ కంపెనీగా, సంస్థ చర్యలకు ఎవరో ఒకరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధం. దయచేసి నా ఉద్యోగులను ఈ వ్యవహారంలోకి లాగొద్దు. ట్విటర్ కొనసాగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు.
‘‘ఫ్యాక్ట్ చెకింగ్ అనేది మమ్మల్ని సత్యానికి మధ్యవర్తిగా చేయదు. మా ఉద్దేశ్యం విరుద్ధమైన ప్రకటనలను గుర్తించి, వివాదంలో ఉన్న సమాచారాన్ని ఎత్తిచూపడం మాత్రమే. తద్వారా ప్రజలు తమకు తాముగా ఏది సత్యమో తెలుసుకోవొచ్చు. మా నుండి మరింత పారదర్శకత చాలా కీలకం కాబట్టి మా చర్యల వెనుక ఉన్న కారణాలను ప్రజలు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది’’ అని డోర్సే ట్వీట్ చేశారు.
ట్రంప్ చేసిన ట్వీట్లు రెండింటి కింద ‘నిజానిజాలు నిర్ధారించుకోవాల్సి ఉంది’ అనే ట్యాగ్‌ను ట్విటర్ తగిలించడం ట్రంప్‌కు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే చాన్సుందని ట్రంప్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు దిగువభాగంలో నీలిరంగు ఆశ్చర్యార్థకం చిహ్నాన్ని ట్విట్టర్ తగిలించింది. అంటే అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాల్సి ఉందని అర్థం. దీంతో ట్రంప్‌కు కోపమొచ్చింది. ‘ట్విట్టర్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోంది. మెయిల్‌ఇన్ బ్యాలెట్లపై నా ప్రకటన సరికాదని వాళ్లు చెబుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సీఎన్‌ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్ట్‌ల ఆధారంగా నిజానిజాలను నిర్ధారించుకోమంటున్నారు’ అని ట్విటర్‌పై ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా సంస్థలనే బంద్ చేయిస్తానంటూ ట్రంప్ చిందులు తొక్కారు. అటువంటి ఎకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు ఆయనకు అధికారాలు లేకపోయినప్పటికీ ఈ విధంగా తన కోపాన్ని ప్రదర్శించారు. సంప్రదాయిక అభిప్రాయాల గొంతునొక్కేందుకు టెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అలా జరిగే లోపే వాటిని కట్టిడి చేసేందుకు, లేదా బంద్ చేసేందుకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా చట్టాల ప్రకారం కంపెనీలను మూసేసే చట్టం తీసుకురావాలంటే అందుకు తొలుత చట్ట సభల ఆమోదం కావాలి. ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ సంస్థ అమోదం కూడా అవసరం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment