అమెరికా గుప్పిట్లోకి భారత్‌ | Why Donald Trump Praise Of India At The United Nations | Sakshi
Sakshi News home page

అమెరికా గుప్పిట్లోకి భారత్‌

Published Wed, Sep 26 2018 5:03 PM | Last Updated on Wed, Sep 26 2018 5:03 PM

Why Donald Trump Praise Of India At The United Nations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం నాడు ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారంటూ పలు మీడియాల్లో ప్రముఖంగా వార్తలొచ్చాయి. ఈ మాటలకు మురిసిపోతే ముందున్న ముప్పును ఊహాంచలేం. ఆ మాటకోస్తే ఒక్క భారత్‌నే కాదు, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, పోలాండ్‌ దేశాలను కూడా ఆయన పొగిడారు. గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను ‘రాకెట్‌ మేన్‌’ అని, ‘సూసైడ్‌ మిషన్‌’పై వెళుతున్నాడని విమర్శించిన ట్రంప్‌ నిన్న ఆయన్ని కూడా ప్రశంసించారు. ఇరాన్, వెనుజులా, క్యూబా, చైనా, జర్మనీ దేశాలను విమర్శించారు. అంటే ఓ స్పష్టమైన వైఖరితోనే వ్యూహాత్మకంగా ట్రంప్‌ మాట్లాడారన్నది అర్థం అవుతోంది.

డొనాల్ట్‌ ట్రంప్, భారత్‌ను ప్రశంసించడం అంటే అమెరికా కక్ష్యలోకి భారత్‌ అడుగు పెడుతోందనడానికి కచ్చితమైన సంకేతం. ఈ నెల మొదట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతోని ‘కామ్‌కాసా’గా వ్యవహరించే ‘కమ్యూనికేషన్‌ కంపాటిబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అరెంజ్‌మెంట్స్‌’ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందాన్ని ‘సీస్‌మోవా’ అంటే, ‘కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఒప్పందం ఇరు దేశాల సైన్యాల మధ్య పరస్పర సహకారాన్ని, సమన్వయాన్ని పెంచుతుంది.

అమెరికా మిలటరీ మిత్రపక్ష కూటమిలో చేరేందుకు వీలు కల్పించే మూడు ఒప్పందాల్లో ఈ కామ్‌కాసా లేదా సీస్‌మోవా రెండో ఒప్పందం. ‘లెమోవా’గా పిలిచే తొలి ఒప్పందం ‘లాజిస్టిక్స్‌ ఎక్స్ఛేంజ్‌ మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌’పైన 2016లోనే ఇరుదేశాల సంతకాలు చేశాయి. అప్పటి భారత రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్, అప్పటి అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్‌ కార్టర్‌లు దానిపై సంతకాలు చేశారు. ఇక ‘బేసిక్‌ ఎక్స్చేంజ్‌ అండ్‌ కోపరేషన్‌ అగ్రిమెంట్‌ (బీఈపీఏ)’ ఒప్పందంపైన సంతకం చే యాల్సి ఉంది. ఈ సంతకం కూడా చేసేస్తే భారత్‌ పూర్తిగా అమెరికా మిలటరీ గుప్పిట్లో ఇరుక్కుపోయినట్లే. అప్పుడు అమెరికా, అమెరికా సైన్యం సూచించిన ఆయుధాలనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అన్య దేశాలపై అమెరికా చేస్తున్న, చేయబోయే యుద్ధాల్లో భారత్‌ సైన్యం కూడా ప్రత్యక్షంగా పాల్గొనాల్సి వస్తుంది.

ఇప్పటికే రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తున్న విమాన విధ్వంసక క్షిపణులు ‘ఎస్‌–400’ను కొనద్దంటూ అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ క్షిపణులు భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో అవసరం. ఇరాన్‌ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతిని సంపూర్ణంగా నిలిపివేసినట్లయితేనే రష్యా నుంచి ఈ క్షిపణుల దిగుమతిని అనుమతిస్తామని గత కొంతకాలంగా ఇరాన్‌పై కత్తిదూస్తున్న అమెరికా భారత్‌కు అల్టిమేటమ్‌ కూడా జారీ చేసింది. చమురు ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన ఇరాన్‌ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతిని భారత్‌ పూర్తిగా నిలిపివేసినట్లయితే దేశీయంగా చమురు ధరలు మరింతగా మండిపోతాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షలకు పాక్షికంగా తలొగ్గిన భారత్, ఇరాన్‌ నుంచి చమురు ఉత్పత్తులను డాలర్ల రూపంలో కాకుండా రూపాయల్లోనే దిగుమతి చేసుకుంటోంది.

నాటి చర్చ నేడేది?
సరిగ్గా పదేళ్ల క్రితం భారత్‌లోని అప్పటి మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం, అమెరికాతోని పౌర అణు ఒప్పందం చేసుకోవడం పట్ల దేశంలో పెద్ద చర్చ జరిగింది. అలీన విదేశీ విధానానికి విడాకులిచ్చి అమెరికాతోని అణు ఒప్పందాన్ని చేసుకున్నదంటూ మన్మోహన్‌ ప్రభుత్వంపైన దుమారం కూడా రేగింది. విమర్శించిన పక్షాల్లో బీజేపీ కూడా ఉంది. అదే ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా అమెరికాతో సైనిక ఒప్పందాలు చేసుకుంటూ వెళుతోంది. మరో గల్ఫ్‌ యుద్దం వస్తే ఆ పరిణామాలు భారత్‌పై ఎంత భయంకరంగా ఉంటాయో కనీసం ఊహించలేం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement