అమెరికాలోని కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాల్లో ఏర్పడిన రెండు కార్చిచ్చులు అక్కడి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ దావానలం వ్యాపించిన ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న వేలాది మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలాగే కొలరాడో కార్చిచ్చుకు బాధ్యుడంటూ ఓ వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నెల వ్యవధిలో బ్రిటన్‌లోని ఉత్తర ప్రాంతం అడవుల్లో ఏర్పడిన రెండు కార్చిచ్చులను అక్కడి ప్రభుత్వం అతికష్టం మీద అదుపులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో కార్చిచ్చు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం...
భూకంపం, కరువు, తుపానులు, వరదలు లాంటి ప్రకృతి విపత్తే కార్చిచ్చు. దీన్ని ఇంగ్లిష్‌లో వైల్డ్‌ఫైర్, వైల్డ్‌ల్యాండ్ ఫైర్, బ్రష్ ఫైర్, బుష్ ఫైర్, ఫారెస్ట్ ఫైర్.. తదితర పేర్లతో పిలుస్తారు. సహజసిద్ధంగానో, మానవ చర్యల వల్లనో అడవులు తగలబడటాన్ని కార్చిచ్చుగా చెప్పొచ్చు. వీటి కారణంగా పక్షులు, జంతువులతోపాటు మానవులూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. దాదాపు 420 మిలియన్ సంవత్సరాల కిందటి నుంచే కార్చిచ్చులు ఏర్పడుతున్నట్లు కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా పరిశోధకులు గుర్తించారు.
మానవుని చేష్టలతో ఏర్పడేవే ఎక్కువ!
కార్చిచ్చులు సహజంగా మెరుపులు ఏర్పడినప్పుడు, పిడుగులు పడినప్పుడు, చెట్లు రాపిడికి గురైనప్పుడు, అగ్నిపర్వతాల పేలుళ్ల సమయంలో ఏర్పడతాయి. కానీ, ప్రస్తుతం మానవ చర్యల వల్లే అధికంగా సంభవిస్తున్నాయి. కొందరు ఆకతాయి చేష్టలతో నిప్పు పెట్టడం, సిగరెట్లు ఆర్పకుండా పడేయడం, అడవులకు సమీపంలో ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు, పట్టణీకరణ, పంట పొలాల తయారీ, యుద్ధాలు.. ఇలాంటి వాటిలో ముఖ్యమైనవి. కెనడా, చైనాలో సంభవించే కార్చిచ్చుల్లో అధిక భాగం మెరుపుల వల్ల ఏర్పడుతుండగా, మిగిలిన దేశాల్లోని వాటికి మాత్రం 90 శాతం మానవ చర్యలే కారణమని ఓ పరిశోధనలో తేలింది.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో అధికం..
అడవులు ఎక్కువగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాల్లో కార్చిచ్చులు అధికం. ఈ దేశాల్లో ఏటా ఎక్కడో ఓ చోట భారీ దావానలం ఏర్పడుతుంటుంది. భారత్‌లోనూ అప్పుడప్పుడూ అడవులు తగలబడుతుంటున్నప్పటీకీ ఇవంత భారీ స్థాయిలో ఉండవు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం, నల్లమల అడవుల్లో , తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటివే ఏటా ఏర్పడుతుంటాయి.
సైబీరియా తైగాలో 4.7 కోట్ల ఎకరాలు ఆహుతి!
2003లో రష్యాలోని సైబీరియాలో ఏర్పడిన కార్చిచ్చు 4.7 కోట్ల ఎకరాల్లోని అడవిని అగ్నికి ఆహుతి చేసింది. తైగా ఫైర్స్‌గా పిలచే ఈ దావానలం అత్యధిక విస్తీర్ణంలో అడవిని దహించిందిగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాతి స్థానాల్లో .. నార్త్‌వెస్ట్ టెర్రిటరీస్ ఫైర్–2014 (84లక్షల ఎకరాలు–కెనడా), మనిటోబా వైల్డ్‌ఫైర్–1989 (81లక్షల ఎకరాలు–కెనడా), బ్లాక్ ఫ్రైడే బుష్ ఫైర్–1939 (50లక్షల ఎకరాలు– ఆస్ట్రేలియా), ది గ్రేట్ ఫైర్–1919 (50లక్షల ఎకరాలు–కెనడా) ఉన్నాయి. ఇక అత్యధిక మంది ప్రాణాలను హరించిన కార్చిచ్చుల జాబితాలో 1918 అక్టోబర్ 15న అమెరికాలో ఏర్పడిన ఫారెస్ట్ ఫైర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది వెయ్యిమంది ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసింది. 1997, సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో 240 మందిని, 1987 మేలో చైనాలో 191 మందిని, 2009 ఫిబ్రవరి 2న ఆస్ట్రేలియాలో 180 మందిని కార్చిచ్చులు బలితీసుకున్నాయి. వీటికి జంతువులు, పక్షుల సంఖ్య అధికం. కాగా, ఈ ఏడాది మార్చిలో తమిళనాడులోని ఊటీ సమీపంలో కార్చిచ్చు బారిన పడి 8 మంది విద్యార్థులు మృతిచెందిన సంగతి తెలిసిందే.
ఆర్పడం అంత సులభం కాదు!
అప్పుడప్పుడూ ఊళ్లలో ఏర్పడే చిన్న చిన్న అగ్నిప్రమాదాలను ఆర్పాలంటేనే భారీగా నీళ్లు అవసరమవుతాయి. ఇక వందలు, వేల ఎకరాల్లో చుట్టుముట్టిన అగ్నికీలల్ని ఆర్పాలంటే పెద్ద సాహసమే చేయాలి. మొదట గాలి దిశను, మంటల తీవ్రతను అంచనా వేయాలి. అడవుల్లో ఎక్కడెక్కడ రోడ్లు, కాలువలు, నదులు, చెట్లు లేని ప్రాంతాలు ఉన్నాయో ఎంచుకొని అటువైపు నుంచి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. దీన్నే ఫైర్ రింగ్ అంటారు. ఒకవైపు మంటలు అదుపు చేస్తూనే మరోవైపు వ్యాపించకుండా మధ్యలోని చెట్లను కొట్టేయాలి. ఇవన్నీ చేయడానికి ఫైర్ ఫైటర్లు(అగ్నిమాపక సిబ్బంది) ఉంటారు. వీళ్లు ఫైర్‌ఫ్రూఫ్ దుస్తులు, ఆక్సిజన్ మాస్కులు ధరించి, మంట ఆర్పే సామగ్రితో రంగంలోకి దిగుతారు. నీళ్లు చల్లుతారు. కొత్తగా ఇప్పడు ఫైలెట్ రహిత విమానాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మంటలు ఆర్పే రసాయనాన్ని పిచికారి చేస్తారు. నీళ్లనూ చల్లుతారు. అయినప్పటికీ గాలి ఉద్ధృతంగా వీస్తే మాత్రం మంటలు ఆర్పడం అంత సులభం కాదు.
దుష్పరిణామాలు
కార్చిచ్చులను సకాలంలో అదుపు చేయకపోతే నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. వేలు, లక్షల సంఖ్యలో వృక్షాలు బూడిద అవుతాయి. లక్షలాది జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతాయి. కార్చిచ్చులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, కొన్నిచోట్ల ఊళ్లకు ఊళ్లనే స్వాహా చేస్తాయి. అలాగే వాతావరణానికీ తీవ్ర నష్టం కలిగిస్తాయి. అడవులు తగ్గి సకాలంలో వర్షాలు పడవు. భారీగా విడుదలయ్యే పొగ కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఈ పొగను పీల్చిన మనుషులకు శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముడతాయి. ఆమ్లవర్షాలు కురుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment