నిర్మాతగా ధనుష్‌కు మరో గిఫ్ట్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, స్వయానా ఎంతో పేరున్న ధనుష్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. సరిగ్గా రెండు వారాల క్రితం విడుదలైన తమిళ చిత్రం ‘మారి’ మంచి ఓపెనింగ్స్ సాధించడం ఒక కారణమైతే, నిర్మాతగా ఆయన చేపట్టిన తాజా ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడం మరో కారణం. మొన్న జూలై 28 మంగళవారంతో 32 ఏళ్ళు నిండిన ఈ బర్త్‌డే బాయ్‌కు రెండు రోజుల తరువాత ఒక ఊహించని గిఫ్ట్ దక్కింది.
ఈ యువ హీరో నిర్మిస్తున్న ప్రయోగాత్మక తమిళ థ్రిల్లర్ చిత్రం ‘విసారణై’ (దర్యాప్తు అని అర్థం) ప్రతిష్ఠాత్మక వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. మన దేశంలో ఇంకా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తొలిసారిగా ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని కాంపిటీషన్ సెక్షన్‌లో ప్రీమియర్ జరుపుకొంటోంది. ఒక పక్కన తాను హీరోగా నటిస్తూనే, మరోపక్క కొత్త తరహా చిత్రాలను నిర్మించడానికి ముందుకొస్తున్న ధనుష్‌కు నిర్మాతగా ఇలా అంతర్జాతీయ గుర్తింపు రావడం ఇది రెండోసారి.
ఆ మధ్య ఆయన నిర్మించిన తమిళ చిత్రం ‘కాక్కా ముట్టై’ (కాకి గుడ్డు అని అర్థం) అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా వంతు ‘విసారణై’ది. గతంలో ధనుష్‌తో ‘పొల్లాదవన్’ (2007) లాంటి థ్రిల్లర్ రూపొందించిన దర్శక - రచయిత వెట్రిమారన్ ఈ ‘విసారణై’ దర్శకుడు. కేవలం 60 నిమిషాలే ఉండే ఈ సినిమా శిక్ష పడిన ఇద్దరు ఖైదీల చుట్టూ నడుస్తుంది.
‘‘72 ఏళ్ళ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో కాంపిటీటివ్ కేటగిరీలో ప్రవేశించిన తొలి తమిళచిత్రం ‘విసారణై’. మా చిత్ర నిర్మాణ సంస్థ ‘వండర్‌బార్ ఫిల్మ్స్’కు ఇది గర్వకారణం’’ అని ధనుష్ వ్యాఖ్యానించారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన తమిళ చిత్రాల్లో నటించిన ‘అట్టకత్తి’ ఫేమ్ దినేశ్, ‘ఆడుక్కళమ్’ ఫేమ్ మురుగదాస్, సముద్రకణి ఇందులో ప్రధానపాత్రధారులు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగే 72వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ తమిళ చిత్రం ధనుష్‌కు మరెన్ని ప్రశంసలు తెస్తుందో చూడాలి.