ఏప్రిల్ 11న కొచ్చాడయాన్ విడుదల
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'కొచ్చాడయాన్' ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న విడుదల కానుంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో సరికొత్త ముందడుగని సౌందర్య అంటున్నారు. గత సంవత్సరం భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో, ఈసారి దాని తదుపరి ముందడుగుగా కొచ్చాడయాన్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మన దేశంలో పెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీ ఆధారంగా తీసిన పూర్తిస్థాయి తొలి సినిమా ఇదేనని, ఇతర యాక్షన్ చిత్రాల కంటే ఇది చాలా విభిన్నంగా నిలుస్తుందని తాను ఆశిస్తున్నానని సౌందర్య అన్నారు.
కొచ్చాడయాన్ సినిమాలో చాలా విభిన్నమైన పెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలిసారి ఉపయోగించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే యుద్ధాన్ని ఇందులో చూపించారు. రజనీకాంత్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు దీపికా పడుకొనే, శరత్ కుమార్, నాజర్, ఆది, శోభన, రుక్మిణి తదితరులు నటిస్తున్నారు.
ఇరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, భోజ్పురి, బెంగాలీ, పంజాబీ భాషల్లో విడుదల చేస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 6వేల థియేటర్లలో ఇది విడుదల కానుంది. అంతర్జాతీయంగా ఇంగ్లీషులోనూ విడుదల అవుతోందని ఇరోస్ ఎండీ సునీల్ లుల్లా తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. కార్బన్ మొబైల్ సంస్థ ప్రత్యేకంగా ఈ చిత్రం బ్రాండుతో పది లక్షల మొబైల్ ఫోన్లు విడుదల చేస్తోంది. వీటిని ఆడియో లాంచ్ సందర్భంగా మార్కెట్లోకి తెస్తారు. ఇందులో సినిమాకు సంబంధించిన స్క్రీన్ సేవర్లు, కొన్ని స్టిల్స్, ట్రైలర్, సిగ్నేచర్ ట్యూన్ ఉంటాయి.