![Sakshi Special Snterview With Actor Manchu Vishnu](/styles/webp/s3/article_images/2020/03/8/Vishnu-%282%29.jpg.webp?itok=4WnV7_NE)
విష్ణు మంచు
ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నారు విష్ణు. ఈ బ్రేక్‌లో ఖాళీగా కూర్చోలేదాయన. కథలతో కూర్చున్నారు. కథల మీద కూర్చున్నారు. వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
కెరీర్‌ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. నిర్మాణ సంస్థను పటిష్టం చేసుకున్నారు. మరింత వేగంగా దూసుకెళ్లడానికే ఈ గ్యాప్ అంటారాయన. సరికొత్త కోణాన్ని చూపించబోతున్నాను అంటున్న విష్ణు మంచుతో ఇంటర్వ్యూ.
► ‘ఆచారి అమెరికా యాత్ర’ (2018) తర్వాత కొత్త సినిమా ప్రారంభించడానికి కొంచెం విరామం తీసుకోవడానికి కారణం?
కావాలనే విరామం తీసుకున్నాను. ‘ఆచారి..’ షూటింగ్ అప్పుడే ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని అర్థం అయిపోయింది. దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారికి ఈ విషయం చెప్పాను. నాకు చెప్పిన కథ ఒకటి, షూట్ చేస్తున్న సినిమా మరోటిలా అనిపించింది. సినిమా విడుదలయ్యాక ‘సారీ బాబు.. మీకు హిట్ ఇవ్వలేకపోయాను’ అని నాగేశ్వరరెడ్డిగారు మెసేజ్ పంపారు. ఈ గ్యాప్‌లో ఎక్కడ తప్పు జరుగుతోందా? అనే విషయాన్ని పరిశీలించుకున్నాను. ఏడాదిన్నరగా స్క్రిప్ట్‌లు తయారు చేసుకోవడం మీదే ఉన్నాను. అమెరికాలో ఓ కంపెనీ ఓపెన్ చేసి అక్కడున్న రచయితల్ని, ఇక్కడి రచయితల్ని కలిపి స్క్రిప్ట్ వర్క్ చేశాం.
► తప్పెక్కడ జరుగుతుందో అర్థం చేసుకున్నారా?
నాకు నచ్చే డ్రెస్ కాదు నాకు నప్పే డ్రెస్ వేసుకోవాలనే విషయం అర్థం అయింది. నా సినిమాల్లో స్క్రిప్ట్ ఎప్పుడూ సమస్య కాలేదు. ఎగ్జిక్యూషనే ప్రాబ్లమ్ అయింది. నేను చేయడం వల్ల ఆడని సినిమాలున్నాయి. నా నుంచి అలాంటి సినిమాను ప్రేక్షకులు ఊహించలేదు. ఇప్పుడున్న ఆడియన్స్ కొత్త కంటెంట్‌ను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ‘మోసగాళ్ళు’ని జానర్‌కి కట్టుబడి చేశాం.
► మన దగ్గరి రచయితల్ని కాకుండా అమెరికాలోని రైటర్స్‌తో రాయించడం ఎందుకు? వాళ్ల కథలకి, మన కథలకి వ్యత్యాసం ఉంటుంది కదా?
మన దగ్గర రచయితలు ‘ఢీ’లాగ రాద్దామా? మరో సినిమాలాగా రాద్దామా? అంటున్నారు. జూన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నాను. అప్పుడు మీకే అర్థం అవుతుంది. 15 ఏళ్లుగా నేను చేస్తున్న సినిమాలకు, నా ఆలోచనా విధానానికి సంబంధం లేదు. ప్రస్తుతం నా ఒరిజినల్ వెర్షన్‌ని చూపించాలనుకుంటున్నాను. కెరీర్ ప్రారంభం నుంచే దాన్ని పాటించి ఉంటే సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యుండొచ్చు, ఫ్లాప్ అయ్యుండొచ్చు. కానీ నా ఒరిజినాలిటీ నాకుండేది. ఆడియన్స్‌కి ఏం కావాలో అదే ఇన్ని రోజులూ చేశాను. నాకేం కావాలో అలా ‘మోసగాళ్ళు’ చేస్తున్నాను.
► ఈ బ్రేక్‌లో ఎన్ని స్క్రిప్ట్‌లను సిద్ధం చేసుకున్నారు?
కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ అయ్యాయి. అలాగే నిర్మాణ సంస్థను బలపరుచుకోవాలనుకున్నాను. వరుసగా సినిమాలు నిర్మించేలా ప్రణాళికను రెడీ చేసుకున్నాను. ప్రస్తుతం మూడు సినిమాలు నిర్మించబోతున్నాం. సుబ్బరాజు దర్శకత్వంలో రాజ్ తరుణ్‌తో ఓ సినిమా, రచయిత రాజసింహా దర్శకత్వంలో ఓ సినిమా, మరో కొత్త దర్శకుడితో ఓ సినిమా నిర్మించబోతున్నాను. జూన్ లేదా ఆగస్ట్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించబోతున్నాను. అది నా పెట్ ప్రాజెక్ట్. శ్రీను వైట్లగారితోనూ ఓ ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నాం.
► హాలీవుడ్‌లో సినిమా (‘మోసగాళ్ళు’ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది) ఎందుకు చేయాలనుకున్నారు?
పేపర్‌లో ఓ స్కామ్‌కి సంబంధించిన ఆర్టికల్ చదివి సినిమా చేస్తే బావుంటుందనుకున్నాను. స్క్రిప్ట్ వర్క్ చేశాం. పూర్తి స్థాయి ఇంగ్లీష్‌లోనే చేయాలనుకున్నాం. సినిమా ప్రారంభించే ముందు నా స్నేహితుడు ‘ఇంత ఖర్చు చేస్తున్నావు. ఇంకొంచెం ఖర్చు పెడితే తెలుగు వెర్షన్ కూడా వచ్చేస్తుంది కదా. కేవలం హాలీవుడ్‌లో అంటే రిస్క్’ అన్నాడు. అలా తెలుగు వెర్షన్ కూడా చేశాం. తెలుగు వెర్షన్‌ని మే నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ వెర్షన్ తర్వాత విడుదలవుతుంది. హాలీవుడ్‌లో ఓ పెద్ద స్టార్ నటి ఈ సినిమాలో నటించబోతున్నారు. మే చివర్లో ఆమె షూట్‌లో జాయిన్ అవుతారు. ఆమె పోర్షన్ వరకూ వేరే నటితో చిత్రీకరణ చేసి తెలుగులో ముందే రిలీజ్ చేసేస్తున్నాం.
► ‘చదరంగం’ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు..
నాకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎన్టీ రామారావుగారు ఊరు వెళ్లి వచ్చేలోగా పదవి నుంచి దింపేశారు. అప్పుడున్న పరిస్థితులేంటి? అని కథగా చెప్పాలనుకున్నాం. రాజకీయాల్లో విలన్లు ఉండరు. అవకాశవాదులే ఉంటారు. రాజకీయం అంటే చదరంగమే. జీ5 హిస్టరీలో ఎక్కువ రేటింగ్ ఉన్న సిరీస్ మాదే అని వాళ్లు చెబుతున్నారు. నేను అనుకున్న కథ చెప్పడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ కరెక్ట్ అనిపించింది. ‘ఏది చేసినా నిజాలు చూపించండి’ అని నాన్నగారు అన్నారు. పరుచూరిగారి సలహాలు తీసుకున్నాం. అందుకే ఈ సిరీస్ చుట్టూ ఎటువంటి కాంట్రవర్శీలు లేవు.
► భక్త కన్నప్ప ఎంతవరకూ వచ్చింది?
మూడు నాలుగేళ్ల క్రితం తనికెళ్ల భరణిగారు, నేను ‘భక్త కన్నప్ప’ సినిమా చేద్దాం అనుకున్నాం. అప్పటి నుంచి నేను ఆ కథ మీద కూర్చుని కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తూ స్క్రిప్ట్ రెడీ చేస్తూ వచ్చాను. హాలీవుడ్ నుంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను పిలిపించాను. కాళహస్తిలో విపరీతమైన పరిశోధన చేశాం. హాలీవుడ్ రైటర్‌ని తీసుకున్నాను. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లా ఉండాలనుకున్నాను. స్క్రిప్ట్ అలా తయారుచేశాం. ఆ సినిమా బడ్జెట్టే 95 కోట్లు వరకూ అయ్యేలా ఉంది. దాన్ని ఎలా తగ్గించాలని ఇంకా ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాం. నాస్తికుడు శివ భక్తుడు ఎలా అయ్యాడు? అన్నది భక్త కన్నప్ప పాయింట్. ఈ సినిమా షెడ్యూల్స్ ప్లానింగ్ కోసం పోల్యాండ్, ఐర్లాండ్, అమెరికా, స్కాట్‌ల్యాండ్, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వెళ్లాను.
బడ్జెట్ సహకరిస్తే న్యూజిల్యాండ్ Ðð ళ్లి షూట్ చేయాలనుంది. కొంత భాగం అరకు లోయలో తీయాలి. స్క్రిప్ట్ పూర్తయ్యాక భరణి అంకుల్ ‘నీ విజన్ బావుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని షూట్ చేయలేను. నేను హ్యాండిల్ చేయలేను. కావాలంటే చిన్న బడ్జెట్ సినిమా ఏదైనా చేద్దాం’ అన్నారు. చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత ముగ్గురు పెద్ద దర్శకులను దర్శకత్వం వహించమని అడిగాను. అందులో కొందరు 20–30 శాతం బడ్జెట్‌ని పారితోషికంగా అడిగారు. ఎందుకో నాకు నచ్చలేదు. రిజెక్షన్‌లా అనిపించింది. హాలీవుడ్ అతనితో డైరెక్ట్ చేయిస్తాను. శివుడు పాత్రకు ఓ పెద్ద యాక్టర్‌ని అడిగాను. చేస్తానని అంగీకరించారు. ప్రస్తుతం నా మార్కెట్ 100 కోట్లు కాదు. కానీ కన్నప్ప తర్వాత రావొచ్చు.
► వంద కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసేంత∙డబ్బు మీ దగ్గర లేదా?
నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఈ మధ్య ఐటీ రిటర్న్స్ వాళ్లు వచ్చి ‘ఏంటి? మీ రిటర్న్స్ ఇంత తక్కువ అంటున్నారు’. నా సినిమా ఆడితేనే నాకు డబ్బులొస్తాయి అని చెప్పాను. బయటేమో జనాలు నా దగ్గర బాగా డబ్బులున్నాయి అనుకుంటున్నారు. వాళ్లు అనుకున్నట్టు నా దగ్గర అంత డబ్బుంటే బావుండు.
► కొత్త బిజినెస్ ప్రారంభిస్తున్నట్టున్నారు?
విన్నీ మంచి డిజైనర్. న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ప్రస్తుతం నా బట్టలు, పిల్లల బట్టలు అన్నీ తనే చూసుకుంటుంది. చిన్నపిల్లల బట్టల మార్కెట్ మన దగ్గర అనుకున్నంత లేదు. నువ్వెందుకు ఆ మార్కెట్‌లోకి ఎంటర్ కాకూడదు? అని ఫ్రెండ్స్ పుష్ చేశారు. మే, జూన్‌లో ఆ కంపెనీ ప్రారంభిస్తాం.
► మీకు రెండు పొలిటికల్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
నా ప్రయారిటీ విన్నీ (విష్ణు భార్య విరానికా), నా కుటుంబమే. చంద్రబాబు అంకుల్ నా బంధువే. జగన్ అన్న కుటుంబం విరానిక బంధువులు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు విన్నీ వాళ్ల బ్రదర్ జగన్ అన్న ముఖ్యం. బాలకృష్ణగారు చాలా క్లోజ్. బ్రహ్మణితో బావుంటాను. ఏది ఏమైనా నా ఫస్ట్ ఓట్ విన్నీకే.
► కుటుంబం పెద్దగా అయినట్టుంది?
అవును (నవ్వుతూ). పిల్లలు కావాలనుకున్నప్పుడు దేవుడు కవల పిల్లల్ని (అరియాన, విరియాన) ఇచ్చాడు. ఆ తర్వాత ఐదేళ్లకు అవ్రామ్ పుట్టాడు. ఆ తర్వాత ఐరా. ఈ మధ్య ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ‘ఏవయ్యా నీవల్ల మా ఇంట్లో తిడుతున్నారు. మీకు ఇద్దరు సరిపోరా? పిల్లల్ని కనండీ అంటూ మా ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారు’ అంటున్నారు. మా చెల్లెల్ని ఇబ్బంది పెట్టడం ఆపేయ్ అని జగన్నన్న, షర్మిలక్క అంటారు. ‘ఏవయ్యా, నీకు వేరే పని లేదా?’ అని సుబ్బరామిరెడ్డి అంకుల్ అంటున్నారు (నవ్వుతూ). ఈ బ్రేక్‌లో ఫ్యామిలీతో టైమ్ గడిపే వీలు కుదిరింది. షూటింగ్ లేకపోతే 7 గంటల తర్వాత బయటకు వెళ్లను. అందరూ కలసి డిన్నర్ చేయాలన్నది రూల్. 9కి నిద్రపోతాను. కానీ మా పిల్లలు నిద్రపోవడం లేదు. పిల్లల ఫొటోలు బావుంటాయి అని అందరూ అభినందిస్తుంటారు. అవన్నీ విరానికా ఐడియాలు. తను నాకంటే చాలా తెలివైనది.
Comments
Please login to add a commentAdd a comment