16 మంది జలసమాధి
ఒడిశాలోని హిరాకుద్ డ్యామ్‌లో లాంచీ మునక
మరి కొందరి గల్లంతు
సుమారు 80 మందిని కాపాడిన అధికారులు
భువనేశ్వర్, మల్కన్‌గిరి(ఒడిశా), న్యూస్‌లైన్: ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. మహానదిపై ఉన్న హిరాకుద్ డ్యామ్‌లో లాంచి మునిగి 16 మంది జలసమాధికాగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ 10 మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రత్యేక పునరావాస కమిషనర్ పి.కె. మహాపాత్రో భువనేశ్వర్‌లో తెలిపారు. సహాయ కార్యకలాపాలను రాత్రంతా కొనసాగిస్తామని చెప్పారు. అయితే అనధికార వర్గాలు మాత్రం మృతుల సంఖ్యను 12గా పేర్కొన్నాయి. అయింఠపల్లి పోలీసుస్టేషన్ అధికారి అమితావ్ పండా తెలిపిన వివరాల ప్రకారం...
సంబల్‌పూర్, హిరాకుద్, బార్‌గఢ్‌లకు చెందిన 120 మంది లయన్స్ క్లబ్ సభ్యులు వనభోజనాల కోసం డ్యామ్‌కు ఆవలి వైపునున్న ఝార్సుగుడా జిల్లా జమదార్‌పల్లి ప్రాంతానికి వెళ్లారు. వనభోజనాలు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
లాంచీలో తొలుత సాంకేతిక లోపం తలెత్తింది. అదే సమయంలో నీరు కూడా లోపలికి చేరడంతో అది మునిగింది.
లాంచీ సామర్థ్యం 70కాగా ప్రమాద సమయంలో 90 మందికిపైగా ఉన్నారు. 80 మందిని కాపాడగలిగాం.
మరో లాంచిలోని పర్యాటకులు చేసిన ఆర్తనాదాలు విని నాలుగు నాటు పడవల్లో ఘటనాస్థలికి చేరుకున్నాం.
వనభోజనాలకు వెళ్లేటప్పుడు 2, 3 పడవల్లో వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణంలో ఒకే లాంచిలో రావడంతో అధిక బరువుతో లాంచి అదుపుతప్పింది. ఈ ప్రమాదంపై సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.