19 ఏళ్ల పోరాట బాట | After 19 years as Congress President, Sonia Gandhi Retires: Her Political Journey so Far | Sakshi
Sakshi News home page

19 ఏళ్ల పోరాట బాట

Published Sat, Dec 16 2017 2:47 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

After 19 years as Congress President, Sonia Gandhi Retires: Her Political Journey so Far - Sakshi

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో.. ఇంతవరకూ పార్టీని అన్నీ తానై నడిపించిన సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా ? అన్న పార్టీ శ్రేణుల సందేహాలకు తెరపడింది. తాను రిటైర్‌ అవుతున్నానని సోనియానే స్వయంగా ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా రాజకీయాల్లో ఆమె కొనసాగుతారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి. దాదాపు 20 ఏళ్లు(19 ఏళ్ల 9 నెలలు) కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అనుభవం పార్టీకి  అండగా ఉంటుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లుగా సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నా..ఆమె లేని కాంగ్రెస్‌ను ఊహించడం పార్టీ శ్రేణులకు కష్టమైన విషయం. అంతగా ఆమె కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపి.. ఆ పార్టీకి పదేళ్లు అధికార పగ్గాలు కట్టబెట్టారు.

సోనియా నాయకత్వంలో ఐదేళ్లకే కాంగ్రెస్‌ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. నిజానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా 20 ఏళ్లలో సోనియా ఎన్నో ఆటు పోట్లను చవిచూశారు. 1998లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో లోక్‌సభలో ఆ పార్టీ బలం 141.. అదే సమయంలో సోనియా విదేశీయతను సాకుగా చూపుతూ శరద్‌ పవార్, పీఏ సంగ్మా తదితరులు తిరుగుబాటు చేశారు. 1999 ఎన్నికల్లో సోనియా విదేశీ మూలాలే ప్రచారాస్త్రంగా బీజేపీ బాగా లాభపడింది. సోనియా నాయకత్వంలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓటమిపాలైంది. కాంగ్రెస్‌కు కేవలం 114 సీట్లు మాత్రమే వచ్చాయి. సోనియా సమర్ధతపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కాంగ్రెస్‌ పార్టీలో ఆమె స్థానం బలహీనం కాలేదు. 1999–2004 మధ్యలో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించి రాజకీయంగా ఎన్నో అనుభవాల్ని నేర్చుకున్నారు.   

1999లో చేజారిన ప్రధాని పదవి
నిజానికి అధ్యక్షురాలైన ఏడాదికే  సోనియాకు ప్రధాని పదవి అందినట్టే అంది చేజారిపోయింది. 1999 ఏప్రిల్‌ 17న వాజ్‌పేయి సర్కారు కూలిపోయాక  సీపీఎం నేత హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ చొరవతో కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉందని చెప్పారు. అయితే ఎస్పీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ తన మనసు మార్చుకోవడంతో సోనియా అంచనాలు తప్పాయి. దీంతో తమకు బలం లేదని ఆమె రాష్ట్రపతికి చెప్పాల్సి వచ్చింది.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ కూటమి విజయంతో సోనియానే ప్రధాని అని భావించారు. విదేశీ వనిత అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె మనసు మార్చుకున్నారు. అదే సమయంలో తనకు అనుకూలంగా ఉండేలా మన్మోహన్‌ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపికచేసి తన పట్టు చేజారకుండా చూసుకున్నారు. పదేళ్ల యూపీఏ సర్కారు సమయంలో జాతీయ సలహా మండలి(ఎన్‌ఏసీ) అధ్యక్షురాలిగా సోనియా పనితీరు ప్రశంసలు అందుకుంది. ఉపాధి హామీ వంటి కీలక చట్టాల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. అదే సమయంలో మన్మోహన్‌ సింగ్‌ను అడ్డుపెట్టుకుని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపించారన్న అపవాదును మూటగట్టుకున్నారు.                                       

సోనియా రిటైర్మెంట్‌!
రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందురోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా కీలకవ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? అని శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘నా పాత్ర రిటైర్‌ కావడమే’ అని అన్నారు. గత కొన్నేళ్లుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్‌ కీలక పాత్ర పోషించారన్నారు. సోనియా అధ్యక్షురాలిగా మాత్రమే తప్పుకుంటున్నారనీ, రాజకీయాల నుంచి కాదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా చెప్పారు. సోనియా ఆశీస్సులు కాంగ్రెస్‌కు ఎల్లప్పుడూ ఉంటాయనీ, ఆమె మార్గదర్శకత్వంలో పార్టీ ముందుకు సాగుతుందని ట్వీటర్‌లో వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్‌ చీఫ్‌గా ఎన్నికైనట్లు రాహుల్‌ సర్టిఫికెట్‌ అందుకోనున్నారు.
  –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement