ఆస్పత్రిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే
మద్దతు ఏ వర్గానికో ?
టీనగర్: తమిళనాడులో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. మరికొద్ది గంటల్లో అసెంబ్లీలో బల పరీక్ష జరుగుతున్న సమయంలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు కూడా ప్రాధాన్యతను సంతరించకుంది. గంధర్వకోట్టై అన్నాడీఎంకే ఎమ్మెల్యే నార్ధామలై ఆర్ముగం అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఏ వర్గానికి మద్దతు తెలుపుతారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఆర్ముగం కొన్ని నెలలుగా పేగు జారడంతో బాధపడుతూ వచ్చారు. ఈ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొద్ది రోజుల క్రితం చెన్నై రాజీవ్‌గాం ధీ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఆయనకు హెర్నియా శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలావుండగా ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే గృహ నిర్బంధంలో ఉంచినందున ఆర్ముగం కూడా కనిపించడం లేదంటూ కొన్ని రోజుల క్రితం నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా ఆయన త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన తన మద్దతు ఎడపాడి పళనిస్వామికా? లేదా పన్నీర్ సెల్వంకా? అనేది ప్రకటించనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే కనిపించడం లేదు: పోస్టర్‌తో సంచలనం: కృష్ణగిరి జిల్లా, బర్గూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలియడంతో సంచలనం ఏర్పడింది. ఈయన శశికళ వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి కనిపించడం లేదంటూ బర్గూరు నియోజకవర్గంలో అనేక చోట్ల పోస్టర్లు వెలిశాయి. పోస్టర్ చివరిలో ఇట్లు, బర్గూరు నియోజకవర్గ ప్రజలు అని, సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 94432 68844 అంటూ పేర్కొనబడింది. దీంతో ఈ పోస్టర్లు ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించాయి.
ఎమ్మెల్యేపై మోసం కేసు: పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే శరవణన్‌పై మోసపు ఫిర్యాదు నమోదైంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిస్థితిలో ఓ.పన్నీర్ సెల్వంకు 10 ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇందులో మదురై దక్షిణ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శరవణన్ ఒకరు. శశికళ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్న శిబిరం నుంచి మారువేషంలో తప్పించుకుని వచ్చి పన్నీర్ సెల్వం శిబిరంలో చేరిన విషయం తెలిసిందే.
మదురై మదిచ్చియం ప్రాంతానికి చెందిన న్యాయవాది జయరాం మదురై పోలీసు కమిషనర్‌కు ఒక ఫిర్యాదు పత్రం అందజేశారు. అందులో మదురై దక్షిణ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు ఎస్‌ఎస్ శరవణన్ ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం తన వద్ద రెండు లక్షల నగదు కోరగా 8 మే, 2016లో అందజేశానని, రెండు నెలల్లో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చిన అతను నగదు ఇవ్వకుండా మోసం చేశాడని తెలిపారు. అందువల్ల అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిగురించి ఎమ్మెల్యే శరవణన్ మాట్లాడుతూ ఇది అబద్ధపు ఫిర్యాదని, దీనిని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు.