మహిళా జర్నలిస్ట్‌పై కేసు
న్యూఢిల్లీ: వివాదాలతో సావాసం చేసే జాతీయ సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లాని 23 ఏళ్ల మహిళా టీవీ జర్నలిస్టుపై కేసు పెట్టారు. తనను ఆమె వేధింపులు, భయాందోళనకు గురి చేస్తున్నారని గిర్‌గౌమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
‘కార్యాలయ ప్రాంగణంలో నిరంతరం నా వెంట పడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. అత్యుత్సాహంతో నన్ను నిబ్బంది పెడుతున్నారు. అనవసరంగా ఫొటోలు తీయడం, సంబంధంలేని ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నారు. ఆమె లోనికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మా కార్యాలయ సెక్యురిటీ, సిబ్బందిపై దూషణలకు పాల్పడ్డార’ని నిహ్లాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసందర్భ ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారని, తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని నిహ్లాని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను సదరు టీవీ చానల్, రిపోర్టర్ తోసిపుచ్చారు. నిహ్లాని తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ప్రొఫెషన్‌లో భాగంగా రిపోర్టర్ ప్రశ్నలు అడగడం సాధారమని, ఇది వేధింపులకు కిందకు రాదని టీవీ చానల్ ఎడిటర్ పేర్కొన్నారు. తమ రిపోర్టర్ పట్ల నిహ్లాని అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.