సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్‌కు చికిత్స చేసేందుకు అందరు డాక్టర్లు అర్హులు కారు. ఫిజీషియన్లు, ఇన్‌ఫెక్శియస్ డిసీస్ స్పెషలిస్ట్స్, పులుమాలోజిస్ట్స్, క్రిటికల్ కేర్ డాక్టర్స్, అనస్థెటిస్ట్స్ అర్హులు. ఇలాంటి చికిత్సలకు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా అవసరం. హార్ట్, క్యాన్సర్, బ్రెయిన్, లాపరోస్కోపిక్, బ్రెయిన్ సర్జన్లు ఈ కోవలోకి రారు. అయితే నేడు ప్రాంతీయ భాషా ఛానళ్ల నుంచి దేశవ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్ ఛానళ్లు ఎక్కువగా కరోనా చికిత్స కోవలోకి రాని వారినే పిలిపించి లేదా వారి వద్దకే వెళ్లి అభిప్రాయాలను చెప్పిస్తున్నారు. (మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్)
ఒక్క అలోపతి వైద్యులే కాకుండా ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధా, యునాని వైద్య ప్రక్రియలకు చెందిన ప్రతి ఒక్క నిపుణుడు పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని తగిలించుకుంటారనే విషయం తెల్సిందే. నేడు వారంతా కూడా టీవీల ముందు సెలబ్రిటీలు అవుతున్నారు. వారందరితో కలసి కరోనా వైరస్ చికిత్సకు ఏ వైద్య విధానం పనికి వస్తుందనే విషయమై ముఖాముఖి చర్చ పెడితే అది ఉపయోగకరం. ఎవరికి వారిని విడివిడిగా పిలిచి అభిప్రాయాలు అడుగుతుండడంతో వారిచ్చే సమాచారం లేదా సమాధానాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వారి సమాధానాలు పరస్పరం భిన్నంగా ఉంటున్నాయి. (లాక్ డౌన్ పొడిగింపుపై కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు)
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా దేశ, విదేశాల్లో ఉన్న వైద్య విద్యార్థులందరిని విధుల్లోకి తీసుకోవాలని, వారు పరీక్షలు పాసయినా, పాస్ కాకపోయినా, ఎక్కడైనా పని చేసిన అనుభవం ఉన్నా, లేకపోయినా ఫర్వాలేదని ఓ సెలబ్రిటీ హార్ట్ సర్జన్ ఓ టీవీ కార్యక్రమంలో సూచించడం ఆశ్చర్యం. దాని వల్ల రోగులకు, వైద్య విద్యార్థులకు నష్టం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వారం రోజుల్లోగా రెండువేల పడకల ఐసీయూలను ఏర్పాటు చేయాలని, వాటికి పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ కూడా ఉండాలని మరో డాక్టర్ సూచించారు. ఆయన భారత్‌ను మరో చైనా అనుకున్నారా, ఏమిటీ? భారత్‌లోని వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా సూచనలు, సలహాలు ఇవ్వడం అర్థరహితమే అవుతుంది.
అసలే ప్రభుత్వ ఆస్పత్రులు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. దక్షిణాదిలో మరో రెండు నెలల్లో కూల్చివేయాల్సిన ఆస్పత్రి భవనాన్ని పూర్తిగా ‘కోవిడ్–19’ ఆస్పత్రిగా మార్చివేశారు. అందులో కూడా పైపుల ద్వారా ఆక్సిజన్ అందించే పరిస్థితి లేదు. వారం రోజుల్లో పైపుల ద్వారా ఆక్సిజన్‌ను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం సాధ్యమా, కాదా ? అన్న విషయాలను ‘పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్’ చెప్పగలరుగాని, ఇతరులు కారు. టీవీ ముఖంగా ప్రజలతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్న డాక్టర్లంతా తమ తమ విభాగాల్లో నిపుణులే కావచ్చు. అయితే వారికి కరోనా చికిత్స విషయంలో సరైన అవగాహన ఉండే అవకాశం లేదు. ఈ విషయంలో వైద్య నిపుణులను పిలిపించే టీవీ వారికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. (క్లోరోక్విన్.. మాకూ ఇవ్వండి)
1. పిలవాల్సింది అలోపతి ఎంబీబీఎస్ లేదా ఎండీ లేదా సర్జన్‌నా? లేదా ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్దా డాక్టర్‌నా?
2. డాక్టర్ ఏ రంగంలో స్పెషలిస్ట్ ?
3. డాక్టర్ పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్ అవునా?
4. కరోనా వైరస్‌కు చికిత్స చేసిన అనుభవం డాక్టర్ ఉందా ?
5. డాక్టర్‌కు శాస్త్ర విజ్ఞాన ప్రిన్సిపుల్స్ పాటిచ్చిన చరిత్ర ఉందా ? అన్న మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకొని ఎవరిని పిలవాలో లేదా ఎవరి అభిప్రాయాలను సేకరించాలో? అన్న విషయంలో స్పష్టత ఉండాలి. ఎవరినో ఒకరిని పిలిచి ఏదో ఒకటి చెప్పిస్తే పోలా! అనుకోవడం తీవ్రమైన పొరపాటు.
Comments
Please login to add a commentAdd a comment