'స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపండి'
న్యూఢిల్లీ: ప్రభుత్వం పారదర్శకంగా పని చేసేందుకు సామాజిక మాధ్యమాలలో మంత్రులు, ప్రభుత్వాధికారులు స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి మాధ్యమాల్లో అధికారులు స్వేచ్ఛగా భావాలు వ్యక్తపరిచేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) డ్రాఫ్ట్ రూల్స్‌ను ప్రతిపాదించిన నేపథ్యంలో జరిగిన ‘మైగవ్’ యాప్ రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
పారదర్శక ప్రభుత్వంలో ప్రభుత్వాధికారులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వ తుది నిర్ణయాల్లో అందరూ ఒకే అంశానికి కట్టుబడి ఉండాలని, ఒకే నిర్ణయాన్ని తెలపాలని జైట్లీ అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో ఉపయోగం ఉందని, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అనేక వైపుల నుంచి విమర్శలు, వ్యాఖ్యలు, అభిప్రాయాలు, సూచనలు వస్తుంటాయన్నారు.
పంటబీమా లాంటి ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఏ మాధ్యమాన్ని ప్రభుత్వం వదులుకోకూడదని, మాధ్యమాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం పొందవచ్చన్నారు. ఇటీవల జీఎస్టీ, దివాలా చట్టాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని.. ఈ నిర్ణయం వెనక ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా పాత్ర ఉందన్నారు.