గోవా మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలోకి నైజీరియన్లను అనుమతించొద్దని అన్నారు. వారు నిగ్రోలు అంటూ కాస్తంత కఠిన పదజాలంతో మాట్లాడారు. వారి ప్రవేశంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. గోవాకు నైజీరియా దేశానికి చెందిన టూరిస్టులు అవసరం లేదని, వారితో అన్ని సమస్యలే అని మంగళవారం మీడియాతో అన్నారు.
'భారత ప్రభుత్వం వారిని తప్పకుండా నిషేధించాలి. వారి గురించి పకడ్బందీగా విచారించాలి. వారు ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నారా లేక పిక్ నిక్ వస్తున్నారా లేక మత్తుపదార్థాలు అమ్ముకునేందుకు వస్తున్నారా అనే విషయం గుర్తించాలి' అని ఆయన డిమాండ్ చేశారు. నైజీరియన్లు ఇక్కడి వస్తారు.. దాదాగిరి చేస్తారు. ఢిల్లీ.. బెంగళూరు.. మొత్తం దేశంలోనూ ఇదే పరిస్థితి. మనం నైజీరియన్లందరినీ ఏరిపారేయాలి. అసలు వారు ఏ స్కూళ్లలో, కాలేజీల్లో చదువుతున్నారు? అవి నిజమైనవా బోగస్ విద్యాసంస్థలా అనేది పరిశీలించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం' అని ఆయన చెప్పారు' నైజీరియన్ల జీవన శైలితో గోవా తీర ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని గత నెల(మే) 30న గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వ్యాఖ్యలు చేసిన అనంతరం మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.