నేను మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్‌డాక్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ తరహా ఫండ్స్‌కు సంబంధించి పన్ను విధి విధానాలు మారాయని మిత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించమంటారా? వద్దంటారా? లేకుంటే ఈ ఫండ్ నుంచి పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌కు మళ్లించమంటారా? - లోకేశ్, జగిత్యాల
మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్‌డాక్ ఈటీఎఫ్ అనేది అంతర్జాతీయ ఫండ్. ఈ తరహా అంతర్జాతీయ ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమనిబంధనల్లో మార్పు, చేర్పులు చేస్తూ బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి ఫండ్స్‌ను ఇప్పుడు డెట్ ఫండ్స్‌గా పరిగణిస్తారు.
ఈ ఫండ్ నుంచి మీరు మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అలా కాకుండా మూడేళ్లలోపు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు పొందే లాభాలపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ప్రతిపాదనల దృష్ట్యా ఇలాంటి ఫండ్స్‌కు ఆదరణ తగ్గుతోంది.
అయినప్పటికీ, మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్‌డాక్ ఈటీఎఫ్ అనేది మంచి ఇన్వెస్ట్‌మెంట్ కిందనే పరిగణించవచ్చు. అమెరికాలో ఉండి, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లోనే ఈ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఫండ్ నుంచి బాగానే ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో కనీసం మూడేళ్లు ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనాలు పొందగలం. ఈ దృష్ట్యా చూస్తే పన్ను నిబంధనల ప్రభావం ఉండదు. నిరభ్యతరంగా ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి.
నా మిత్రుడు ఇటీవల ఒక యులిప్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు యులిప్స్‌ల సరళి మారిందని, ఇన్వెస్ట్ చేయమని నాకు కూడా సలహా ఇచ్చాడు. ఒక వేళ చేస్తే ఎంత కాలం వరకూ ఇన్వెస్ట్ చేయాలి? - పవన్, గుంటూరు
మీ మిత్రుడు చెప్పింది కొంతవరకూ నిజమే. 2010 సెప్టెంబర్ తర్వాత వచ్చిన యులిప్‌లు అంతకు ముందటి యులిప్‌లతో పోల్చితే కొంచెం నయమే. కానీ అవి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గ ఫండ్స్ కావని చెప్పవచ్చు. వీటి ట్రాక్ రికార్డ్‌ను అంచనా వేయడం కష్టం.
అంతేకాకుండా యులిప్‌లో లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంత పారదర్శకంగా యులిప్‌లు పనిచేయవు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ రెండిటిని వేర్వేరుగా చూడాలని మేం ఎప్పుడూ చెబుతుంటాం. యూలిప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు బదులుగా ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
ముందుగా ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకోండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లను పరిశీలించవచ్చు. ఆ తర్వాత మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి, మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఇతర మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
నేనొక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మార్కెట్లో చాలా టర్మ్ ప్లాన్‌లు ఉన్నాయి. అయితే వివిధ సంస్థల టర్మ్ ప్లాన్‌ల కవరేజ్ ఒకే విధంగా ఉన్నా, ప్రీమియమ్‌ల్లో మాత్రం చాలా మార్పులు ఉన్నాయి. 70-80 శాతం వరకూ తేడాలున్నాయి. ఇలా ఎందుకు ఉంటోంది ? నేను రిలయన్స్, అవైవా, ఏఎక్స్‌ఏ, ఎస్‌బీఐ లైఫ్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి? - సుజాత, విజయనగరం
టర్మ్ ప్లాన్స్‌కు ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే బీమా చేసిన మొత్తాన్ని చెల్లించడం. ఇక వివిధ కంపెనీలు వివిధ అంశాలను ఆధారంగా తీసుకొని ప్రీమియమ్‌లను నిర్ణయిస్తుంటాయి. అందుకనే ఒక్కో సంస్థకు 70-80% వరకూ తేడా ఉండడం సాధారణమే. గతంలో బీమా కంపెనీ చెల్లించిన క్లెయిమ్‌లు, వసూలు చేసే ప్రీమియం.. ఈ రెండు అంశాల ఆధారంగా టర్మ్ ప్లాన్‌లు తీసుకోవాలి.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే, దిగువ సంస్థల టర్మ్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు. భారతీ ఏఎక్స్‌ఏ లైఫ్ ఈప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఈ-షీల్డ్-లెవెల్ కవర్.. ఇవన్నీ ఆన్‌లైన్ టర్మ్ పాలసీలు. మీ వయస్సును బట్టి మీరు చెల్లించే ప్రీమియం, మీ బడ్జెట్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన టర్మ్‌ప్లాన్‌ను ఎంచుకోండి.
ఇంటర్నేషనల్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?
Published Mon, Sep 8 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement