ఇద్దరు పశు వ్యాపారుల హత్య
రాంచీ: దాద్రీ ఘటన మరువక ముందే జార్ఖండ్‌లో ఇద్దరు పశువ్యాపారుల హత్య సంచలనం సృష్టిస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలోని లతేహార్ జిల్లా బలూవ ుత్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ముస్లిం పశువుల వ్యాపారులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పశువుల వ్యాపారులైన మహమ్మద్ ముజ్లూమ్ (35), ఆజాద్ ఖాన్ అలియాస్ ఇబ్రహీం(15) శుక్రవారం రాంచీకి సమీపంలోని పశువుల మార్కెట్‌కు గేదెలను తీసుకె ళ్తుండగా, గుర్తుతెలియని కొందరు వీరిని అడ్డగించి హత్య చేశారు. ముఖాలకు గుడ్డకట్టి, చేతుల్ని వెనక్కి విరిచి వీరిని చెట్టుకు ఉరితీసినట్లు జిల్లా ఎస్పీ అనూప్ బర్తారీ మీడియాకు చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. నిందితుల్లో ఒకరైన మిథిలేశ్ ప్రసాద్ సాహుకు, స్థానిక పశు సంరక్షణ బృందంతో సంబంధముందని పేర్కొన్నారు. కాగా, మృతదేహాలను కిందికి దించుతున్నప్పుడు అక్కడి గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి లాఠీచార్జీ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. హత్యల వెనుక హిందూ శక్తులున్నట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతంత్రిక్) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ రామ్ ఆరోపిస్తున్నారు. కేవలం పశువుల వ్యాపారులు కావడం వల్లనే వీరిని లక్ష్యంగా చేసుకున్నారన్నారు.