ఎంతటి దయనీయం!
మల్కన్‌గిరి(ఒడిశా): దేశంలోనే దయనీయ పరిస్థితులలో ఉంది ఒడిశా రాష్ట్రం. ఒంటి మీద ఉన్న ఒకే చీరను, ఉతికి మళ్లీ ఒంటి మీదే ఆరబెట్టుకునే మహిళా కూలీలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడి ప్రజల దరిద్రాన్ని కళ్లకట్టే సంఘటన ఒకటి ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది. తినడానికి తిండి లేదు - భార్యకు జబ్బు - మందులు కొనడానికి డబ్బులేదు -చేసేదేమీలేక ఆ వ్యక్తి రెండు నెలల వయసున్న తన కొడుకును 700 రూపాయలకు అమ్మేశాడు. మల్కన్‌గిరి జిల్లా కోర్కుండ బ్లాక్ లోని చిట్టపల్లి-2 గ్రామానికి చెందిన గిరిజన దంపతులైన సుకురా ముదులి, ధుముసి నిరుపేదలు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ధుముసికి మందులు కొనాల్సి వచ్చింది. కానీ డబ్బుల్లేకపోవడంతో ఆ దంపతులు గత ఫిబ్రవరిలో దగ్గర్లోని చిట్టపల్లి-3 గ్రామానికి వెళ్లి 'ఆశా'కార్యకర్తకు తన బిడ్డను అమ్మేశారు.
ఆమె ధుమసికి మందులకోసం రూ. 700లతోపాటు 50 కేజీల బియ్యం ఇచ్చింది. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ రెడ్డి దర్యాప్తు చేయాలని శిశుసంక్షేమ కమిటీని ఆదేశించారు. పేదరికం వల్లే సుకురా అమ్మినట్లు దర్యాప్తులో తేలింది. సుకురా దంపతులకు బిడ్డను పోషించే తాహతు లేకపోవడంతో ఆ బాలుడు ప్రస్తుతం ఆశా కార్యకర్త ఇంట్లోనే ఉంటున్నాడు.