బర్వాణి, మధ్యప్రదేశ్ : కూతురు కులాంతర వివాహం చేసుకోవడం ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. ఆమె చేసిన పని వల్ల తమ పరువు పోయిందని భావించిన వారు కన్నప్రేమను కూడా మర్చిపోయి రక్తం పంచుకుని పుట్టిన కూతురునే దారుణంగా హతమార్చారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖేతియాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి ఖేతియా పోలీసు స్టేషన్ ఎస్సై రాజేంద్ర ఇంగిల్ మాట్లాడుతూ ‘పట్టణానికి చెందిన సర్లా మాలి (24) సమీప గ్రామానికి చెందిన పంకజ్ ఇద్దరు ప్రేమించుకున్నారు, వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే సర్లా మాలి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. కారణం పంకజ్ వారి సామాజిక వర్గానికి చెందినవాడు కాడు. దాంతో సర్లా ఇంటి నుంచి వెళ్లిపోయి పంకజ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత పంకజ్ గ్రామంలోనే దంపతులు నివాసం ఉంటున్నారు.
కూతురు కులాంతర వివాహం చేసుకోవడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. దాంతో కన్న ప్రేమను కూడా మర్చిపోయి, కూతురుని చంపాలని నిర్ణయించుకుని పథకం రచించారు. దాని ప్రకారం సర్లా సోదరుడు ఆమె ఇంటికి వెళ్లి తల్లికి ఆరోగ్యం బాగాలేదని, తనతో ఇంటికి రావాలని సర్లాను కోరాడు. సర్లా అందుకు ఒప్పుకుని తల్లిని చూడ్డానికి సోదరునితో పాటు బుధవారం నాడు పుట్టింటికి వెళ్లింది. సర్లాను చంపాలని నిర్ణయించుకున్న కుటుంబ సభ్యులు చెరుకు కత్తిరించే పరికరాలతో ఆమెపై దాడి చేసి చంపేశారు’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సర్లా తండ్రి దేవిదాస్ కోలి(55)ను అదుపులోకి తీసుకున్నారు. సర్లా తల్లి తుల్సీబాయి(50), సోదరుడు హీరలాల్(25) పరారీలో ఉన్నారు. నిందుతుల మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద మర్డర్ కేసును నమోదు చేసుకొని, పారిపోయిన వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment