చెన్నై: జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ తర్వాత తమిళనాడు పోలీసుల ప్రవర్తన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఎన్ని నిరసనలు వ్యక్తం అయినప్పటికి పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఆదివారం చోటు చేసుకుంది. భర్తని పోలీసులు రక్తం వచ్చేలా కొట్టడంతో భరించలేకపోయిన ఓ ఇల్లాలు ఏకంగా ఎస్సై చెంప పగలగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా అనత్తూర్ గ్రామానికి చెందిన ముత్తురామన్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన షార్ట్‌లిస్ట్‌లో అతని పేరు ఉంది.
అయితే ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన ప్రైవేటు కాంట్రాక్టర్ సుభాష్ చంద్రబోస్‌తో ముత్తురామన్‌కు వివాదం తలెత్తింది. ఇంటి కోసం తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని కాంట్రక్టర్‌పై ముత్తురామన్ ఆరోపణలు చేశాడు. దీని గురించి తిరువెన్నైనల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. విచారణ కోసం ఎస్సై సహా ఇద్దరు పోలీసులు అనత్తూర్ చేరుకున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ముత్తురామన్‌ని పోలీసులు ప్రశ్నించారు. సరిగ్గా సమాధానం చెప్పడం లేదంటూ ముత్తురామన్‌ని రక్తం వచ్చేలా కొట్టారు పోలీసులు. (కస్టడీ డెత్: మరో కీలక మలుపు)
ఇది చూసిన అతని భార్య సారథికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెనకాముందూ ఆలోచించకుండా భర్తని కొట్టిన ఎస్సై చెంప పగలగొట్టింది. ఈలోగా ముత్తురామన్ ఎస్సై ఫోన్, బైక్ తాళాలు లాక్కుని పరిగెత్తి గ్రామస్తులకు దీని గురించి చెప్పాడు. సంఘటన స్థలానికి చేరుకున్న జనాలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇంటికొచ్చి కొట్టడమేంటని ప్రశ్నిస్తూ ఆందోళన చేశారు. దాంతో చేసేదిలేక పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ముత్తురామన్ భార్య పోలీస్‌పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. నేరుగా గ్రామానికి చేరుకుని జరిగిన విషయంపై ఆరా తీశారు. పోలీసులపై చేయి చేసుకున్న విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment