ప్రశాంత్‌కు విమాన టికెట్‌ను అందజేస్తున్న తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు
నందిపేట్: బతుకుదెరువు కోసం ఏడారి దేశం వెళ్లిన యువకుడిని దురదృష్టం వెంటాడింది. ఖతార్ దేశానికి వెళ్లిన ఆరు నెలల్లోనే అతని తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసింది. ఉన్న పళంగా తిరిగి వచ్చేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు ముందుకు వచ్చి అతని ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేసి ఇంటికి పంపించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మల్లారం గ్రామానికి చెందిన ప్రశాంత్ ఆరు నెలల క్రితం ఉపాధి కోసం ఖతర్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనికి కుదిరాడు.
ఇంతలో తన తండ్రికి రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణపాయ స్థితిలో ఉన్నాడని ఇంటి నుంచి సమాచారం అందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రశాంత్ కన్నీరుమున్నీరయ్యాడు. వెంటనే ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. కానీ అతని వద్ద డబ్బులు లేవు. దీంతో పరిచయం ఉన్నవారితో తన తండ్రి ఆరోగ్య విషయం చెప్పి తనను ఇంటికి పంపించాలని వేడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన శ్రావణ్ అక్కడ ఉన్న గల్ఫ్ సమితికి తెలియజేశారు. దీంతో ప్రశాంత్‌కు గల్ఫ్ సమితి సభ్యుడు రాజుగౌడ్ విమాన టికెట్ ఖర్చులు అందజేయగా.. ఇంటికి చేరుకున్నాడు. తనకు సహకారం అందించిన తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులకు ప్రశాంత్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment