తెల్లోడి చట్టానికి మన్ననా? | my life..my choice on gay sex | Sakshi
Sakshi News home page

తెల్లోడి చట్టానికి మన్ననా?

Published Sat, Dec 14 2013 11:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

తెల్లోడి చట్టానికి మన్ననా? - Sakshi

తెల్లోడి చట్టానికి మన్ననా?


బైలైన్
 ఎం.జె.అక్బర్
సీనియర్ సంపాదకులు
 
 హెన్రీ గ్లాఫోర్న్ గురించి ఎన్న డూ విని ఉండనందుకు మిమ్మ ల్ని తప్పు పట్టేవారు ఎవరూ లేరు. మూడున్నర శతాబ్దాల క్రితం జీవించిన ఆ నాటక కర్త షేక్‌స్పియరేమీ కాడు కదా. అయితే ఆయన రాసిన ‘హాస్యం పై ప్రతీకారం’ నాటకంలోని ‘చట్టం బుద్ధి లేని గాడిద’ అనే ఒక్క వాక్యం మాత్రం అజరామరంగా నిలిచిపోదగినది.
 
 

అదే అభిప్రాయం... మరింత కచ్చితంగా చెప్పాలంటే చట్టం ఒక్కో సందర్భంలో మూర్ఖంగా ఉండగలదనే అభిప్రాయం కాలక్రమంలో పునరవృతమయ్యే పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. కాబట్టి నేటి న్యాయమూర్తులు ప్రత్యేకించి అత్యున్నత న్యాయస్థానాన్ని అధిష్టించి ఉన్నవారు చెడ్డ చట్టం కంటే ఉన్నత స్థానంలో నిలుస్తారని, అందులో కుళ్లి కంపుకొడుతున్న దాన్ని సరిచేసి ఉత్తమమైనదాన్నంతా పరిరక్షిస్తారని ఎవరైనా భావిస్తారు. కానీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా చేసే భారత శిక్షాసృతిలోని 377వ ఆర్టికల్‌పై ప్రస్తావనా మాత్రంగా చేసిన వ్యాఖ్యతో మన సుప్రీం కోర్టు ప్రగతి పథాన్ని తిరస్కరించి తిరోగమించాలని నిర్ణయించుకుంది. అది బ్రిటన్ వలస పాలకులు 1861లో మనపై రుద్దిన చట్టం. వాళ్లు వెళ్లిపోయి చాలా కాలమైన తర్వాత కూడా నిలిచి ఉంది.
 
 

కపటత్వం ఇంగ్లీషువారి జబ్బేమీ కాదు. అది చెల్లుబాటులో ఉన్న వైఖరుల లక్షణం మాత్రమే. అవి ఎలా ఉత్థాన పతనాలను చూస్తూ ఉంటాయనేది మరో కథ. కానీ నైతికతలో ఇలాంటి సంక్రమణాలు ఉండనైతే ఉన్నాయి. 19వ శతాబ్దపు విక్టోరియా శకంలో సామాజిక దురలవాట్లను సహించేవారు కారు. ప్రత్యేకించి బ్రిటిషువాళ్లు అసలే సహించేవారు కారు. స్వలింగ సంపర్కం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న ఆ సమాజంలోనే దానికి సమాంతరంగా అదే అలవాటు పెంపొందుతుండటం కనబడుతుం ది. నిజానికి ఈ సమాంతర వృద్ధి పర్యవసానమే ఆ అసహనమేమోనని ఆశ్యర్యం కలుగుతుంది. ఆనాటి బాలుర బోర్డింగ్ స్కూళ్లలో స్వలింగ సంపర్కం విస్తృతంగా సాగేది. అది పరస్పర అంగీకారంతో జరిగేది మాత్రమే కాదు కూడా. ఆ స్కూళ్లల్లో చదువుకున్న ఇంగ్లిషు ఉన్నత వ ర్గాల్లో అది విస్తృతంగా వ్యాప్తి చెందింది. అయితే విక్టోరియన్ నైతికత ఎంత ప్రబలమైనదంటే గత దశాబ్ది వరకు అదే స్వలింగసంపర్కంపై బ్రిటిష్ చట్టాన్ని శాసిస్తూ వచ్చింది.
 
 

పందొమ్మిదవ శతాబ్దిలోనే బ్రిటిష్ సామ్రాజ్యం బ్రహ్మాండంగా వృద్ధి చెందింది. వలసల నూతన యజమానులుగా వారు ఆ సామాజిక చట్టాలనే అక్కడ కూడా విస్తరింపజేశారు. బ్రిటన్ సామ్రాజ్యానికే తలమానికమైన భారత్ ఆ పరోపకారుల దృష్టిలో పడకుండా పోలేదు. మన దేశంలో బ్రిటిష్‌రాజ్‌ను స్థాపించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతీయ జీవితంలోకి జోక్యం చేసుకోవడంలో తమకున్న పరిమితి తగు మాత్రం తెలుసు. కంపెనీ గవర్నర్ జనరళ్లలో కొందరు హిందూ, ముస్లిం సామాజిక చట్టాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నించారు. అయితే కం పెనీ అందుకు భారీ మూల్యాలనే చెల్లించాల్సి వచ్చింది.
 
 1857 తిరుగుబాటు అది చెల్లించుకున్న మూల్యాల్లో తక్కువ ప్రాముఖ్యం గలదేమీ కాదు. 1857లో కంపెనీ పగ్గాలు కోల్పోయాక భారత్ ప్రత్యక్షంగా బ్రిటన్ సింహాసనం పాలన కిందకు వచ్చింది. లండన్ లోనినైతికవాదులు తమ కంటే అతిసూక్ష్మ నైతిక వివేచన గలిగిన నాగరికతలపై తమ దృష్టికి ఏది మంచి, ఏది చెడు అయితే వాటినే రుద్దడానికి పూనుకున్నారు. బ్రిటన్ సింహాసనాధిపత్యం కిందకు వచ్చిన మూడేళ్లకే బ్రిటిష్ ఇండియా ఆ స్మృతిని స్వీకరించింది. యూదు, క్రైస్తవ, ఇస్లాం మత చట్టాల్లో స్వలింగ సంపర్కంపై తీవ్ర విమర్శలున్నాయని సూచించే కొన్ని వ్యాఖ్యానాలు ఇటీవల వెలువడుతున్నాయి. అందుకు భిన్నంగా హిందూ మతం స్వలింగ సంపర్కాన్ని మత విశ్వాస వ్యవస్థలో భాగంగానే అంగీకరించింది. మొఘల్ చక్రవర్తులు కూడా అంతే సానుకూల దృక్పథంతో వ్యవహరించారు. అయినా వాళ్లు అంగీకరించకుండా ఎలా ఉంటారు? మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ ఒక యువకునిపై ఆయనకున్న ప్రేమను అద్భుతమైన వర్ణనలతో డైరీలో రాసి పెట్టాడాయె. సాధారణ భారతీయుల వైఖరిలాగే మొఘలుల వైఖరి కూడా ఆచరణాత్మకమైనది.
 
 ఈ అంశంపై అత్యుత్తమమైన అవగాహన ను అందించినది బహుశా ఫ్రాయిడ్ వివరణే కావచ్చు. అదే కావడం అనివార్యం కూడా కావచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1935లో రాసిన ఒక లేఖలో ‘స్వలింగ సంపర్కం ఒక సానుకూలత కాదు, దుర్వ్యసనంగానీ లేదా రుగ్మత గానీ కాదు. దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీలేదు. స్వలింగ సంపర్కాన్ని శిక్షించడం మహా అన్యాయం, క్రూరత్వం’ అన్నాడు.
 
 విషాదకరంగా మన సుప్రీంకోర్టు ఆ అన్యాయానికి సాధికారతను కల్పించి తన విశ్వసనీయతను పోగొట్టుకుంది. ఢిల్లీ హైకోర్టు ఏడాది క్రితమే పాత తప్పును సరిదిద్దే చారిత్రక అవకాశాన్ని సృష్టించింది. సుప్రీంకోర్టు రాబోయే 150 ఏళ్లకు కొలబద్ధను నెలకొల్పడానికి బదులు గత 150 ఏళ్ల సందేహాస్పద తర్కానికి పాల్పడింది. అలాంటి మార్పును తేవాల్సిన బాధ్యత శాసన విభాగానిదేనంటూ తన వాదానికి ఆధారాన్ని చూపింది. అయితే అది సమర్థన మాత్రమే. ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాగే నిర్ణ యం తన పరిధికి వెలుపలిది అనుకోలేదు. సుప్రీం కోర్టుకు తదుపరి తరం న్యాయమూర్తులను అందించే కోర్టుల్లో అది కూడా ఒకటి.
 
 మన దేశంలో స్వేచ్ఛ బేరసారాలకు అతీతమైన ప్రాథమిక హక్కు. తమతో ఏకీభవించే వారికి మాత్రమే స్వేచ్ఛను వర్తింపజేసేట్టయితే అలాంటి స్వేచ్ఛ అర్థరహితమైనది. ఇతరులకు కూడా చోటును కల్పిస్తేనే చట్టం మానవ హక్కుల పరిరక్షణ కర్త అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పులోని కొన్ని వాదనలు ‘విలువైనవి’. దేశంలో నూటికి ఒక్కరు స్వలింగ సంపర్కులే ఉంటే అదేమంత పట్టించుకోవల్సింది కాదనేది అందులో ఒకటి. అయితే ఆ ఒక్కరికి కూడా... వారు ఇతరుల హక్కుల దురాక్రమణకో లేక అణచివేతకో పాల్పడనంత కాలం అన్ని హక్కులు ఉంటాయి. స్వలింగ సంపర్కం భిన్నలింగ సంపర్కుల హక్కులకు భంగం కలిగించేదేమీ కాదు.
 
 అలాంటప్పుడు అది చట్టవిరుద్ధం ఎందుకవుతుంది? భారత శిక్షాస్మృతిలోని ఆ సెక్షన్ కింద నమోదైన కేసులు చాలా అరుదనే దాని వాదన కూడా సరైనది కాదు. ఒక్క వ్యక్తే అయినాగానీ ఎందుకు నేరారోపణకు గురికావాలి? ఇలాంటి హక్కులకు సంబంధించి ‘పాశ్చాత్యమైనది’ లేదా ‘ప్రాచ్యమైనది’ ఏదీ లేదు. శివ, కేశవులకు పుట్టిన శబరిమల స్వామి అయ్యప్ప అట్లాంటిక్ తీరంలో ప్రత్యక్షమైనవాడేం కాదు.
 
 ఈ తప్పును సరిదిద్దుకోడానికి ఇప్పటికే బాగా ఆల స్యం అయిపోయిందా? న్యాయస్థానంలో ఉండేది మానవ మాత్రులే గానీ దేవతలు కాదు. తప్పు చేయడం మానవ నైజం. గొప్ప స్వేచ్ఛా సిద్ధాంతకర్త అయిన రోబిస్పియర్ చెప్పిన ఈ మాటలు తోవను చూపిస్తాయేమో ‘‘అనుల్లంఘనీయమైన మానవ హక్కులకు విఘాతం కలిగించే ఏ చట్టమైనా ఆవశ్యకంగానే అన్యాయమైనది, నిరంకుశమైనది. అదసలు చట్టం కానే కాదు.’’  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement