ఏమిటీ పతనం?
పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజులకు తగ్గింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంలో మన పార్ల మెంటరీ ప్రజాస్వామ్యంలో చోటు చేసుకుంటున్న అవ లక్ష ణాల గురించి మళ్లీ చర్చ మొ దలైంది. అసలు భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సా ద్యపడుతుందా? అని ఆదిలో శంకించిన మేధావుల అభిప్రాయాలను పూర్వపక్షం చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించింది.
స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులు ఎదురైన ప్పుడు బ్రిటిష్ వారు భారత్‌కు అమెరికా తరహా ప్రజా స్వామ్య పాలన కావాలా, బ్రిటిష తరహా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలా? అనే చర్చ లేవనెత్తారు. గాం ధీజీ, నెహ్రూజీ, డా॥బాబూ రాజేంద్రప్ర సాద్ వంటి మహానుభావులు నిర్ద్వంద్వంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే సరైనదనీ, ఆదర్శప్రాయమనీ తేల్చా రు. చట్టసభలు- పార్లమెంట్ అయినా రాష్ట్రాల్లోని శాసనసభలైనా ’టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ‘గా స్థానం పొందాయి.
అంతటి పవ్రితత వాటికి ఉంది. ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ప్రభుత్వాలు చట్టాల రూపక ల్పనకు ఉపక్రమించినప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపడి, సవరణలు ప్రతిపాదించి ప్రజలకు మేలు చేసేవి. ప్రజ లు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుతోనే చట్టసభలు నడుస్తున్నాయన్న స్పృహ, తమకు జీతభత్యాలు లభిస్తు న్నాయన్న స్పృహ ప్రతి సభ్యునిలో కనిపించేది. అధికా రం ఉన్నంత మాత్రాన పాలకపక్షం ఏకపక్షంగా చట్టసభ ల్ని నడుపుకున్న వైఖరి చాలా ఏళ్ల పాటు కనిపించలేదు.
‘అధికార పక్షం సహనంతో ఎదుటి పక్షాలు చెప్పే విషయాలను వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లడం సాధ్యమవుతుంది’ అన్నారు మహా త్మాగాంధీ. పార్లమెంటును అధికార పార్టీ శాసించకుం డా ఉండేందుకు స్పీకర్ వ్యవస్థ రాజకీయాలకు అతీ తంగా ఉండాలని లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మవలాం కర్ ప్రతిపాదించారు. స్పీకర్ పదవికి ఎన్నికయ్యే వ్యక్తి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయకుండా ఉం డాల న్నారు. అయితే... తొలి ప్రధాని నెహ్రూజీ మవలాంకర్ ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... స్పీకర్ తటస్థంగా ఉండే సంప్రదాయాన్ని కొనసాగించడం మంచిదని పేర్కొన్నారు. చాలా ఏళ్లు అలాంటి ఉన్నత సంప్రదాయాలే కొనసాగాయి.
ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సఖ్యత, సౌహార్ద్రం వెల్లివిరిసిన కారణంగానే... భారత పార్లమెంటరీ ప్రజా స్వామిక వ్యవస్థను అనేక దేశాలు అబ్బురంతో చూశా యి. కానీ అన్ని వ్యవస్థలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థలో విలువల పతనం శీఘ్రంగా జరగ డంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వేగంగా దిగ జారుతోంది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు నానీ పాల్కీవాలా అన్నట్లు మన రాజ్యాంగ వ్యవస్థను తూట్లు పొడిచారు. ఎప్పుడైతే రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయ పార్టీల్లో లోపించిందో అప్పట్నుంచి చట్టసభల తీరు మారిపోయింది.
పార్లమెంటు సమావేశాల వ్యవధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని శాసించడంపై మాధవ్ గాడ్‌బోలే ‘ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీ ఆన్ ట్రయిల్’ అనే పుస్తకంలో ‘మన రాజ్యాంగకర్తలు అప్ప ట్లో కేంద్ర ప్రభుత్వాలు ఈ అధికారాన్ని ఇంతగా దుర్వి నియోగం చేస్తాయని ఊహించలేదు’ అని రాశారు. మన పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజు లకు తగ్గింది. కావాలని సమావేశాలను అడ్డుకోవడం ఎక్కువైంది.
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని తీవ్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడివడింది కనుక శాసనసభ సమావేశ కాలపరిమితిని తగ్గిస్తున్నామని కొందరు మంత్రులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర భౌగోళిక స్వరూపం మారితే... ప్రజల సమస్యలు తగ్గిపోతాయి? ఎంతో అనుభవజ్ఞులైన అమాత్యులది అమాయకత్వం అనుకోవాలా? అజ్ఞానం అని భావించాలా? ఎప్పుడైతే ఆదర్శంగా ఉండాల్సిన పార్లమెంటు, శాసన సభల్లో ప్రభుత్వాలు పలాయనవాదం చిత్తగిస్తున్నాయో, ఆ బాటలోనే కిందిస్థాయి ప్రజాసంస్థలు ప్రయాణించడం చూస్తున్నాం. ఇక చట్టాలను రూపకల్పన చేసే వారే స్వయంగా చట్టాల్ని ఉల్లంఘించే దృశ్యాలు పార్లమెంటు మొదలు మునిసిపల్ కౌన్సిల్ వరకు సర్వసాధారణం.
చర్చలు లేకుండానే బడ్జెట్ పద్దులు గిలెటిన్ కావ డం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇక ‘కాగ్’ లాంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు వెల్ల డించే అంశాలపై చర్చించడం అరుదైన విషయంగా మారింది. జనాభా ప్రాతిపదికన మహిళలకు, మైనార్టీ లకు, బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతి నిధ్యం లేకపోవడం ఒక ప్రధాన లోపం.
ఆశ్చర్యం ఏమిటంటే కొందరు మంత్రుల సమర్థ తను వారి పనితీరును అనుసరించే కాక ప్రతిపక్షం నోరు మూయించడంలో చూపే నైపుణ్యాన్ని అనుసరించి లెక్క వేస్తున్నారు. చట్టసభల పనితీరును మెరుగుపర్చడా నికి, సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సూచనలు చేస్తూ వచ్చిన ఎన్నో నివేదికలు ప్రభుత్వాల వద్ద మూలుగుతు న్నాయి. ‘లా కమిషన్’ సూచనలు ఉన్నాయి. కానీ ఎవరు అమలు చేస్తారు?
ఈ ఏడాది జూలై ఆఖరు నుంచి ఆగస్టు 13 వరకు 17 రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ 48 గంటలు పని చేయవలసి ఉండగా కేవలం 9 శాతం సమయం మేరకే కార్యకలాపాలు జరిగాయి. ఒక్క బిల్లు మాత్రమే ఆమోదం పొందడం (91 శాతం సమయం వృథా) చూస్తే ఏ మేరకు మన పార్లమెంటు పని చేయగలిగిందో అర్ధమవుతోంది. ఇంతకంటే అథ మసూచిక... 2010లో జరిగిన శీతాకాల సమావేశాలలో రెండంటే రెండు (2) శాతం సమయం మాత్రమే సమా వేశాలు జరిగాయి.
ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు హూగ్‌సె గాల్ పార్లమెంట్ వ్యవస్థను గురించి ’'Government come and Government go, but the institution of Parliament is one of those frame works that must endure and must never be taken for granted.' అన్నాడు. దీనికి అంతం ఎప్పుడు? పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం ఎప్పుడు పరిఢవిల్లుతుంది? ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిన వా రు సామాన్యప్రజలే! వారే సంఘటితమై భారత పార్ల మెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాలి!
(వ్యాసకర్త: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మొబైల్: 99890 24579)