తెరచాటు ‘పాలన’ సరికాదు!
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్
విభజన బిల్లు పట్ల ఆచితూచి వ్యవహరించవలసిన రాష్ర్టపతి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినట్టు కనపడదు. వేల సంవత్సరాల చరిత్ర గల ఒక పెద్ద జాతి అయిన తెలుగు జాతి భవితవ్యంతో చెలగాటమాడుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకున్నట్టు తోచదు! ఇక రాజ్యాంగ చట్టాలను అన్నింటినీ అతిక్రమించడంలో పాలక కాంగ్రెస్ ఎవరికీ లేనన్ని ‘రికార్డులను’ సొంతం చేసుకుంది. చివరికి కోర్టు తీర్పులను సైతం ధిక్కరించడంలోనూ ‘నేర్పరి’గా చావు తెలివితో వ్యవహరించిన చరిత్ర దానికుంది.
తెలుగు జాతిని నిలువునా చీల్చే దుర్మార్గపు ప్రక్రియలో భాగంగా కేవలం ఒక కుటుంబ పాలన కొనసాగింపు కోసం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇటీవలనే పార్లమెంటు ఉభయ సభల్లోనూ సభ్యుల తీవ్రనిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి యత్నించి విఫలమయింది. అయితే ఆ సందర్భంగా సభలలో జరిగిన అవాంఛనీయ పరిణామాల పూర్వరంగంలో పాలక పక్షం రేపు ఎలాంటి అనంతర చర్యకైనా పాల్పడవచ్చు. ఒకసారి నీతి తప్పిన వాడు రెండోసారి తప్పడన్న గ్యారంటీ లేదు. బేరగాడు నేరగాడయితే ఇక అవినీతికి అడ్డూ అదుపూ ఉండదు. పైగా రాజ్యాంగ చట్టాలను అన్నింటినీ అతిక్రమించడంలో పాలక కాంగ్రెస్ ఎవరికీ లేనన్ని ‘రికార్డులను’సొంతం చేసుకుంది. చివరికి న్యాయస్థానాలనూ, వాటి తీర్పులను సైతం ధిక్కరించడంలోనూ ‘నేర్పరి’గా చావు తెలివితో వ్యవహరించిన చరిత్ర దానికుంది! అవసరాన్ని బట్టి వ్యవహరిస్తూ ఒక్కొక్కప్పుడు నిరంకుశంగా రాజ్యాంగ నిబంధనలకు, తప్పుడు భాష్యాలు చెప్పడంలోనూ ఆ పార్టీ ‘ఆరితేరి’పోయింది! ఇందుకు తాజా ఉదాహరణ- 2జీ స్పెక్ట్రం కేటాయింపులపైన గుత్తాధిపత్యం చెలాయించడానికి కొన్ని విదేశీ కంపెనీలకు కాంట్రాక్టులివ్వడంలో జరిగిన కుంభకోణంలో కాంగ్రెస్ పాలకులు భాగస్వాములయినప్పుడు సుప్రీంకోర్టు హెచ్చరించినప్పుడు స్వయాన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీం పరిధుల్ని గుర్తు చేయడానికి సాహసించారు!
ఢిల్లీ బాటలో పయనిస్తారా?
కేంద్రంలో గబ్బుపట్టిపోయిన అవినీతిపై సమరశంఖం పూరించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన ఒక మాజీ ఉన్నతాధికారి అరవింద్ కేజ్రీవాల్ అతి స్వల్పకాలంలోనే ఢిల్లీ పీఠాన్ని అధిష్టించాడు. అయితే దొంగ ‘లోక్‌పాల్’ బిల్లును కాకుండా ‘జన్‌లోక్‌పాల్’ బిల్లును రూపొందించి ఎప్పుడయితే ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పాలకుడు ప్రవేశపెట్టబోయాడో తగిన మద్దతు లేనందున ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామాకు సిద్ధమవుతూ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు జరిపించాలని కోరాడు. ఎన్నికలకు బదులు కాంగ్రెస్ ‘తురుపు’ ముక్కగా రాష్ర్టపతి పాలనను విధించి, అసెంబ్లీని మాత్రం రద్దు చేయకుండా ‘సుప్తచేతనావస్థ’లో ఉంచింది. ఇదే పద్ధతిని, ఆంధ్రప్రదేశ్ విభజన కోసం రేపు యూపీఏ సర్కారు అనుసరించదని భావించరాదు! ఎందుకంటే, మన రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా అది నిట్టనిలువునా చీలిపోయింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ అస్తిత్వ రాజకీయాల్లో భాగంగా విభజనకు వ్యతిరేకంగా ‘సమైక్య రాష్ట్ర’ నినాదాన్ని చేపట్టినప్పటికీ - తన నాయకురాలైన విభజనవాది సోనియా (ఇటాలియన్ మాత) పట్లనే అనుక్షణం విధేయతను ప్రకటిస్తున్నారన్న విషయాన్ని మరచిపోరాదు! ఆయన రెండు పడవలపైన కాలేశారు. ఇటు కాంగ్రెస్‌ను వీడలేక, అటు సోనియాను కాదనలేక త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈలోగా ‘కిరణ్ అధిష్టానం మాట కాదనరని’ కాంగ్రెస్‌లోనే కొందరు అంటుండగా, ‘కాదు, కొత్త పార్టీ పెడతారనీ’, ‘చెప్పు’దాని ఎన్నికల గుర్తుగా ఉండొచ్చని కొందరు పార్టీ ముఖ్యులే ప్రచారంలో పెట్టారు! ఇప్పటికీ పార్లమెంటులో నిబంధనలకనుగుణంగా ప్రవేశపెట్టని విభజన బిల్లు నేడో రేపో ఆ తంతు ముగుస్తుందన్న వార్తలొస్తున్నాయి. ‘‘లేస్తే మనిషిని కాను అన్నట్టు’’ కిరణ్ వ్యవహారం ఉంది. కాని లేచి మనిషిగా మారితే, అంటే విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇస్తూ ఏం చేయనున్నారు? రాష్ట్ర శాసనసభ రద్దుకు కూడా సిఫార్సు చేస్తారా? అలా సిఫార్సు చేసే పక్షంలో రాష్ట్రపతి పాలనను కేంద్రం రాష్ట్రంలో విధిస్తుందా? లేక ఢిల్లీ శాసనసభ రద్దుకు ప్రతిపాదించిన కేజ్రీవాల్ డిమాండ్‌ను (రాజ్యాంగ రీత్యా ఆయనకు ఆ హక్కు ఉన్నప్పటికీ) కేంద్రపాలిత ప్రాంత ప్రతిపత్తిని ఆసరా చేసుకుని రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిద్ధమయినట్టే, ఇటు కిరణ్‌కుమార్ తన సొంత ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర శాసననభ రద్దును కోరినప్పుడు కూడా కేంద్రం అలాగే వ్యవహరిస్తుందా? అన్నది అసలు ప్రశ్న. లేక, సార్వత్రిక ఎన్నికలు తరుముకు వస్తున్నందున రాష్ర్టపతి పాలన ఆరు నెలలపాటు విధిస్తే తనకు కలిగే వెసులుబాటును ప్రచారానికి వినియోగించుకునేందుకు, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకూ వీలుగా రాష్ర్టపతి పాలనను కాంగ్రెస్ విధించే ఆలోచనలో ఉందా? లేక రెండు మాసాలుగా కిరణ్‌కుమార్ జనాలకు ‘భరోసా’ ఇస్తూ వచ్చినట్టుగా ఆయన ముఖ్యమంత్రిత్వంలోనే 2014 ఎన్నికలు జరగబోతున్నాయా? ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం తమది కాదు కాబట్టి దానిని క్షణాల్లో యూపీఏ ప్రభుత్వం పడగొట్టడానికి కుట్ర పన్నగా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా అధికారం వెలగబెడుతోంది కాబట్టి రాష్ట్రపతి పాలనను అదుపు తప్పిపోయిన పరిస్థితుల్లో తప్ప ‘సోనియా కొలుపు’ను కూడా మానుకుంటే తప్ప రాష్ట్రపతి పాలనకు అవకాశాలు ఉండకపోవచ్చు. ‘కేంద్ర మంత్రుల బృందం’లో ముఖ్యుడైన మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటనలో ‘బిల్లు వివాదాస్పదంగా ఉన్నందున, తొందరపడి ముందుకు నెట్టడం సాధ్యపడకపోవచ్చు’నని ఓ ‘టుమ్రీ’ వదలడం విశేషమేమీ కాదు. ‘‘టి-బిల్లును ఆమోదింప చేయించుకుని మరీ వస్తానని చెప్పిన ఒక రాజకీయ నాయకుడు దిగాలు పడిపోవడాన్ని కూడా కొన్ని టీవీ చానళ్లు చూపించాయి! ఇం తకూ ఎందుకలా జరిగి ఉంటుంది? ఆ రాజకీయ నాయకుడు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట ఇచ్చి ఉన్నందున ‘‘ముం దు విలీనం చేయి, ఆ తరువాత విభజన’’ అని కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టింది. ‘‘కాదు, ముందు తెలుగు జాతిని ముక్కలు చేసేయ్, తరువాత కాంగ్రెస్‌లో నా స్థానిక పార్టీని కలిపేస్తానని’’ ఆ నాయకుడు షరతు పెట్టడం జరిగింది. ఈ వాదులాట ఇంకా ఒక కొలిక్కి రాలేదు!
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
రాష్ట్రపతి పాలనకు కేంద్రం ప్రతిపాదన పంపిస్తే, యథాతథంగా అలా సంతకం చేసి పంపమని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. విభజన బిల్లు పట్ల కూడా ఆచితూచి వ్యవహరించవలసిన రాష్ర్టపతి రాజ్యాంగ నిబంధనలకూ సమాఖ్య స్ఫూర్తికీ అనుగుణంగా వ్యవహరించినట్టు కనపడదు! వేల సంవత్సరాల చరిత్ర గల ఒక పెద్ద జాతి అయిన తెలుగు జాతి భవితవ్యంతో చెలగాటమాడుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకున్నట్టు తోచదు! అదే ఉండి ఉంటే - రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశంలో లేనప్పుడు దొంగచాటుగా గవర్నర్‌లు 213వ అధికరణ చాటున ఆర్డినెన్సులూ తీసుకురారు. 356వ అధికరణ కింద రాజ్యాంగ విరుద్ధంగా రాష్ర్టపతి పాలన ‘తెర’ చాటున గత 60 ఏళ్లలోనూ 100 సందర్భాల్లో కేంద్ర పాలకులు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మింగేసి ఉండే వారూ కాదు! అందుకే ఈ ఉన్మాదానికి 1994లో సుప్రీంకోర్టు తెగించి (బొమ్మైకేసులో) తెరదించవలసి వచ్చింది! మళ్లా 20 సంవత్సరాల తర్వాత ఇదే పక్షవాతపు కాంగ్రెస్ కేజ్రీవాల్ పాలిట పడింది! ఎందుకంటే, రాష్ట్రాల్లో రాజ్యాంగ వ్యవస్థ అమలులో విఫలమైందనుకున్నప్పుడు రాష్ర్టపతి పాలనను విధించకుండానే రాష్ర్ట ప్రభుత్వాలను సంస్కరించి, సరిచేసే అధికారాన్ని, అవకాశాన్నీ కేంద్రానికి రాజ్యాంగం 355/256/254/353/365 అధికరణలు కల్పిస్తున్నాయి! అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, రాష్ట్రపతి పాలనకు అవకాశమిస్తున్న 356వ అధికరణపై రాజ్యాంగ నిర్ణయ సభలో వెల్లువెత్తిన విమర్శలకు జవాబిస్తూ ‘‘మిగతా అన్ని ప్రయత్నాలు విఫలమైన తరువాత ఆఖరి తురుపుగా మాత్రమే 356వ అధికరణను ఉపయోగించుకోవచ్చునేగాని, సర్వసాధారణంగా ఆ అధికరణ మృతప్రాయమైనదిగానూ, ఎన్నడూ ఉపయోగించరాని అధికరణగానూ ఉండిపోగలదనే ఆశిస్తున్నాను’’ అన్నారు! ఆయన ఆశ వమ్మయింది! ఒక అధినేత్రి కుటుంబం కోసమో, మరొక నాయకుడి సకుటుంబం కోసమో 9 కోట్ల ప్రజలతో ఉన్న తెలుగు జాతి తన భవిష్యత్తును తాకట్టుపెట్టుకో జాలదు!
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)