తిరుపతి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కుటుంబాలు వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వం తీసుకున్నాయని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆదివారం ఆయన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. పార్టీ శ్రేణుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వం తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
దివంగత నేత వైఎస్సార్‌పై అభిమానం, జననేత జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా గత శుక్రవారం వరకు 70 లక్షల కుటుంబాలు సభ్యత్వం తీసుకున్నాయని, త్వరలోనే కోటి కుటుంబాలు వైఎస్సార్ కుటుంబంలో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోందని, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు కాలేదని విమర్శించారు. లంచాలు, కమీషన్లు వచ్చే పనులనే బడ్జెట్‌లో పెడుతూ రాష్ట్రంలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని బాబు, లోకేశ్‌లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు తరిమి కొడతారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవీంద్రనాథ్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి