గొడవపడుతున్న టీడీపీ శ్రేణులు
తిరుపతి తుడా: తిరుపతి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తొలిరోజు సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం రసాభాసగా మారింది. దీంతో అర్థంతరంగా ఎన్నికల ప్రచారాన్ని ముగించి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల సీనియర్ నేతలంతా సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఆమె, ఆమె అల్లుడి అవినీతి, అక్రమాలు, పార్టీలో సీనియర్లను అవమానాలకు గురి చేస్తున్నారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబు అభ్యర్థి కోసం మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అందరినీ కాదని సుగుణమ్మ పేరును ఖరారు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వాళ్లను ఇదే అవకాశంగా సుగుణమ్మ అల్లుడు సంజయ్ టార్గెట్ చేశారు. సంజయ్ అనుచరులైన కృష్ణాయాదవ్, ఆయన తమ్ముడు ఆనందబాబు యాదవ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల గుణశేఖర్ నాయుడుపై దాడికి దిగారు.
చొక్కా పట్టుకుని ..‘తిమ్మినాయుడు పాళెం మా ఏరియా.. ఇక్కడికి నిన్నెవర్రా రమ్మనింది.. సుగుణమ్మకు టికెట్టు ఇవ్వద్దంటావా ?’ అంటూ తీవ్ర స్థాయిలో బూతులు తిడుతూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న గాలి శ్రీదేవి (గాలి ముద్దుకృష్ణమనాయుడు మరదలు) కలుగచేసుకుని గొడవ ఎందుకు చేస్తున్నారు? గుణశేఖర్‌పై ఎందుకు దాడి చేస్తున్నారని సర్దిచెప్పేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారు ఆమెను తాకరాని చోట చెయ్యి వేసి బలంగా నెట్టివేయడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. కొన్ని క్షణాల పాటు ఆమె తేరుకోలేకపోయారు. అంతేకాకుండా ‘ఏయ్.. వెళ్లు ఇక్కడి నుంచి’ అంటూ ఆమెపై చేయి చేసుకోవడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. పార్టీ నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా ‘ఏం రా.. మీ కులపోల్లంతా ఒక్కటై వచ్చారా.. రా..! ఏం పీకుతార్రా మీరు..? అంత ఉందారా మీకు..? ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ కథ చూస్తా’ అంటూ ఆ వర్గానికి చెందిన నేతపై వీరంగం చేశారు. వారి చేతిలో ఘోర అవమానం పాలైన గాలి శ్రీదేవి శాపనార్థాలు పెట్టారు. ‘నా పై చేయి చేసుకుంటారా?.. నా ఇంటికి వచ్చి ప్రచారానికి రావాలని కోరితే వచ్చాను.. నాపై కూడా దాడి చేయిస్తారా?..మహిళ అని కూడా చూడకుండా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా?..మీ ఇళ్లల్లో లేడీస్‌తో ఇట్లాగే బిహేవ్ చేస్తారా?’ అంటూ దుమ్మెత్తి పోశారు.
వెనుతిరిగిన కమ్మ సామాజిక నేతలు
కులం పేరుతో తీవ్ర పదజాలంతో దూషించడంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అవాక్కయ్యారు. అదే సామాజిక వర్గానికి చెందిన వారంతా తీవ్ర అవమానంతో ఎన్నికల ప్రచారం నుంచి వెనుతిరిగారు. వాళ్ల కోసం పనిచేస్తూ తిట్లు తినాలా.. మనకొద్దు.. ఈ ఎన్నికలంటూ ఆ వర్గం నేతలు వెనుదిరిగారు. ఎం.మోహన్‌రావు, డాక్టర్ సుధారాణి, ఆర్సీ మునికృష్ణ, మస్తాన్ నాయుడు తదితర నేతలంతా మూకుమ్మడిగా అక్కడి నుంచి వచ్చేశారు.
కంగుతిన్న సీనియర్లు
సుగణమ్మ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిని ఆమె అల్లుడు టార్గెట్ చేశారు. తుడా చైర్మన్‌కు అనుచరుడిగా ఉన్న తుమ్మల గుణశేఖర్ నాయుడుపై దాడికి పాల్పడటంతో సీనియర్ నాయకులంతా ఖంగుతిన్నారు. తుడా చైర్మన్‌తో కలిసి సుగుణమ్మను వ్యతిరేకించడమే కారణమని అక్కడున్న వాళ్లంతా చెవులు కొరుక్కున్నారు. తుడా చైర్మన్ అనుచరుడిని కొట్టడం ద్వారా తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇలానే ఉంటుందని గట్టిగా హెచ్చరించేందుకే ఇలా చేశారని పలువురు వ్యాఖ్యానించారు. వారి తీరును ఖండించారు.
ఆగిన ఎన్నికల ప్రచారం
వివాదం తీవ్రం కావడం, కమ్మ సామాజిక వర్గంపై దాడి చేయడం, మహిళపైనా విరుచుకుపడి బండబూతులు తిట్టడంతో ఆ వర్గం నేతలంతా ఏకమయ్యారు. అందరూ మూకుమ్మడిగా వెనుతిరిగారు. దీంతో అర్థంతరంగా ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. సాయంత్రం జరగాల్సిన ప్రచారాన్ని కూడా రద్దు చేసుకున్నారు. నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. అందరినీ పార్టీ కార్యాలయానికి పిలిపించి క్షమాపణ చెప్పించే పనిలో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment