లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. బీజేపీకి అసలు సినిమా ముందుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఒక మునిగిపోయే నావ అని అభివర్ణించారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలన్నీ త్వరలోనే ఆ కూటమిని గుడ్‌బై చెప్తాయని ఆయన జోస్యం చెప్పారు. సిట్టింగ్ స్థానాలైన గోరఖ్‌పూర్, ఫూల్పుర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
‘ఎన్డీయే ఎజెండా విభజన రాజకీయాలతో సాగుతోంది. శివసేనతోపాటు టీడీపీ కూడా ఎన్డీయేను వీడింది. త్వరలో ఏ పార్టీ కూడా ఎన్డీయేలో ఉండదు’ అని శరద్ యాదవ్ లక్నోలో విలేకరులతో అన్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో మంగళవారం భేటీ అయిన శరద్ యాదవ్ త్వరలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా సమావేశమవుతానని తెలిపారు. యూపీలో యోగి సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అసలు వాస్తవమేమిటో ప్రజలు చూపిస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు మహా కూటమి ఏర్పాటు కోసం తాను ప్రయత్నిస్తున్నాని, ఇందులో భాగంగానే దేశమంతట పర్యటిస్తున్నట్టు తెలిపారు. అఖిలేశ్‌తో దాదాపు గంటసేపు భేటీ అయిన శరద్ యాదవ్ జాతీయ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత అంశంపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment