కోర్టు హాల్ ఎదుట కేతిరెడ్డి
ధర్మవరం టౌన్: ఆనాడు తామంతా హోదా కోసం పోరాటం చేస్తే అక్రమ కేసులు బనాయించిన సీఎం చంద్రబాబునాయుడు నేడు హోదా కోసం పోరాటం చేస్తాననడం హాస్యాస్పదమని, ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్న ఆయనను ప్రజలు విశ్వసించరని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రత్యేకహోదా కోసం 2015 ఆగస్టు 29వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ధర్మవరం పట్టణంలో చేపట్టిన బంద్‌ను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అణిచి వేయాలని చూసింది. అయినప్పటికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన కేతిరెడ్డితోపాటు 53 మంది పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి శుక్రవారం స్థానిక సబ్‌కోర్టుకు వాయిదాకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా హోదా కోసం తాము ఆందోళన చేస్తే అక్రమకేసులు బనాయించారన్నారు. అప్పటినుంచి రెండేళ్లపాటు తాము వాయిదాలకు తిరుగుతూనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో హోదా పేరెత్తితేనే జైల్లో పెట్టాలని పోలీసులను ఆదేశించి విద్యార్థులను, ఉద్యమకారులను, ప్రజలను బెదిరించిన సీఎం ప్రజల ఒత్తిడి మేరకు హోదా కావాలని ప్రజల దారికే వస్తున్నారన్నారు. ఆలస్యంగానైనా యూటర్న్ తీసుకున్న ఆయన హోదా ఉద్యమకారులపై కేసులను ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్పెషల్ జీవోలను ఇచ్చి 265 మంది స్వంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల మీదున్న కేసులను ఎత్తివేసిన చంద్రబాబుకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం పోరాడిన వారిపై కేసులను ఎందుకు ఎత్తివేయలేదని ప్రశ్నించారు. ధర్మవరం నియోజకవర్గంలో హోదా ఉద్యమకారులపై బనాయించిన కేసులను తక్షణం ఎత్తివేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment