సాక్షి, ముంబై: మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అంతర్మధనంలో పడింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునారావృత్తం అయితే అసలుకే ఎసరొస్తుందని, లోక్‌సభ ఎన్నికలకు మూడు నెలల ముందే వ్యూహాలకు బీజేపీ పదునుపెడుతోంది. దీనిలో భాగంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకువచ్చే ఆలోచనలో ఉన్న శివసేనతో మంతనాలు చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మహారాష్ట్ర పర్యటనలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో శివసేన తమతోనే ఉంటుందని ప్రకటించారు.
గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. 48 లోక్‌సభ స్థానాలు గల మహారాష్ట్రల్లో బీజేపీ 23, శివసేన 18 స్థానాల్లో గెలుపొందాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు రెండుపార్టీల మధ్య అవగహన కొరవడింది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల పట్ల శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే పలు సందర్భాల్లో బహిరంగానే విమర్శల వర్శం కురిపించారు. నోట్ల రద్దు, అయోధ్య రామమందిరంపై శివసేన మోదీ ప్రభుత్వంపై ఆరోపణల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రామమందిర నిర్మాణంపై ఉద్దవ్ ఠాక్రే పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ ద్వారా ఆలయ నిర్మాణం చేపట్టాలని సేన డిమాండ్ చేస్తోంది. దీనికోసం ఇదివరకే అయోధ్యలో వేల మంది సేన కార్యకర్తలతో యాత్రను కూడా నిర్వహించింది.
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారం పోగొట్టుకోవడం, బీహార్‌లో బీజేపీ భాగస్వామి పార్టీ ఆర్‌ఎల్‌ఎస్పీ కూటమి నుంచి వైదొలగడంతో బీజేపీ నాయకత్వంలో ఒక్కింత అలజడి మొదలైంది. దీంతో ఇప్పటి నుంచే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని పోయే పనిలో కమలదళం నిమగ్నమైంది. అత్యధిక ఎంపీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ గాలి వీచలంటే దానికి శివసేన తోడవ్వక తప్పదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రేతో మంతనాలు జరిపేందుకు కమల దళపతి ప్రయత్నిస్తున్నారు. శివసేన మాత్రం పొత్తుపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయ్యలేదు.
Comments
Please login to add a commentAdd a comment