టెక్కలిలో బహిరంగ సభలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
టెక్కలి : ‘అచ్చెన్నాయుడూ.. 2014 ఎన్నికల్లో నీ గెలుపు కోసం నాతో పాటు జనసేన కార్యకర్తలు భుజం కాశాం.. ఇప్పుడు ఆ భుజాలను నరికివేశావు.. నియోజకవర్గ సమస్యలతో పాటు ఉద్దానం కిడ్నీ బాధితులు, మత్స్యకారుల బాధలను గాలికొదిలేశావు..’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
జనసేన పోరాట యాత్రలో భాగంగా బుధవారం టెక్కలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నారు.
ఉద్దానం కిడ్నీ సమస్యపై గతంలో పర్యటన చేస్తే ప్రభుత్వం హడావుడి చర్యలు చేసిందని, ఇప్పటికీ బాధితులకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేదన్నారు. విదేశాల నుంచి వైద్య నిపుణులను తీసుకువస్తే కనీసం వారిని నియమించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
టెక్కలి నియోజకవర్గంలో సమస్యలు గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. థర్మల్ పోరాటంలో ఉద్యమకారులు అశువులు బాశారని, ఇప్పుడు భావనపాడు పోర్టు నిర్మాణం విషయంలో స్పష్టత లేకుండా ఆదాని కంపెనీలతో లాలూచీ చేసుకుంటున్నారని ఆరోపించారు.
తన పోరాట యాత్రను అడ్డుకోవడానికి గుండాలతో రౌడీ మూకలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి చేష్టలకు బెదిరే ప్రసక్తి లేదన్నారు. ఎంతో పచ్చని వాతావరణం కలిగిన జిల్లాను అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టించే కుట్రలు చేస్తే సహించేది లేదన్నారు.
ఉపాధి లేక వేలాది మంది వలసపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో తన పోరాట యాత్ర ముగిసేలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు.
ఇదిలా ఉండగా పట్టణంలో కవాతు నిర్వహించేందుకు సిద్ధం కాగా శివారు ప్రాంతంలో ఆటంకాలు కలిగించారంటూ పవన్‌తో పాటు ఆయన కార్యకర్తలు తారస్థాయిలో మండిపడ్డారు. సభలో జనసేన నాయకులు రియాజ్, ప్రభు, పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరరావు, స్థానిక కార్యకర్తలు కె.యాదవ్, ఎ.శ్రీధర్, ఎన్.శేఖర్, కె.కిరణ్, ఎం.పూర్ణ, ఎం.అవినాష్, డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్‌కు బందోబస్తు : ఎస్పీ
శ్రీకాకుళం సిటీ: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆ పార్టీ అభ్యర్థన మేరకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మూడు సబ్ డివిజన్ పోలీసు అధికారులకు సెక్యూరిటీ పరంగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
జిల్లా తరుపున పీఎస్‌వోలు, రోప్ పార్టీలు, మప్పికాంపోనెంట్, ట్రాఫిక్ కాంపోనెంట్, లా అండ్ ఆర్డర్ కాంపోనెంట్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్‌కల్యాణ్ బస చేసిన విడిది వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment