పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి
పులివెందుల : అవినీతి సొమ్ముతో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ చేస్తున్న ఆరాచకాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. తన ఓటు తొలగించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఫారం–7 దరఖాస్తు చేయడంపై సోమవారం ఆయన పులివెందులలోని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన ఓటు తొలగించేందుకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారనే విషయం తనను నిర్ఘాంతపరించిందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఏడాదిన్నర నుంచి దాదాపు 58లక్షల వైఎస్సార్‌సీపీ ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందన్నారు.
వీటిని తమ పార్టీ నాయకులు తిరిగి నమోదు చేసే పక్రియ చేపడుతున్నారన్నారు. ఇటీవల ఫారం–7 దరఖాస్తును ఉపయోగించుకుని టీడీపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల పేర్లతో ఓటర్లకు తెలియకుండానే తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మన వేలుతో మన కన్నునే పొడిచే కార్యక్రమానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఒకే ఐడీ నంబర్ నుంచి పెద్ద ఎత్తున ఓట్లు తొలగిపోవడం దారుణమన్నారు. ఇది రాజ్యాంగానికి తూట్లు పొడవమేనని ఆయన అభివర్ణించారు. బాధ్యులపై పోలీసులు, ఎన్నికల కమిషన్ కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలన్నారు.ఈ విషయంపై సీఐ రామకృష్ణుడు మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తొలగింపు ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఈ విధంగా 488 ఓట్లు తొలగించాలని గుర్తు తెలియని వ్యక్తుల పేరుతో దరఖాస్తులు అందాయి. వీటిని ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment