తన సీక్రెట్ చెప్పేసిన కొహ్లీ
సాక్షి, చెన్నై : టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన బ్యాటింగ్ మంత్రాను బయటపెట్టారు. సెంచరీలు చేయాలనే ధ్యాస ఎంత తక్కువగా ఉంచుకోగలిగితే.. అన్ని సెంచరీలు చేయగలుగుతామని 'సెంచరీ మంత్రా'ను కొహ్లీ చెప్పారు. కొహ్లీ ఇప్పటివరకూ వన్డేల్లో 30 శతకాలు సాధించారు. శనివారం మీడియాతో ముచ్చిటించిన ఆయన.. భవిష్యత్‌లో మరిన్ని సెంచరీలు చేస్తారా? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తానేప్పుడూ మూడంకెల సంఖ్య కోసం ఆడలేదని చెప్పారు.
అందుకే తాను ఇన్ని సెంచరీలు చేసివుంటానని అభిప్రాయపడ్డారు. సెంచరీల గురించి ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందే తప్ప ఉపయోగం ఏమీ లేదని తెలిపారు. కేవలం జట్టు గెలుపు కోసం మాత్రమే తాను ఆడతానని వివరించారు. వ్యక్తిగత స్కోరు 98 లేదా 99 వద్ద ఉన్నప్పుడు మ్యాచ్ ముగిసినా ఎప్పుడూ తాను బాధపడలేదని చెప్పారు.
క్రీజులో మ్యాచ్ ముగిసేవరకూ ఉండాలనే భావనతో గ్రౌండ్‌లోకి అడుగుపెడతానని వివరించారు. వ్యక్తిగత అభివృద్ధి కన్నా.. జట్టు గెలుపునకే తన ప్రాధాన్యతని చెప్పుకొచ్చారు.