కెప్టెన్గా ఉంటే అలాగే వ్యవహరిస్తాను
మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి రిటైరయ్యాక కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంకపై సిరీస్ విజయాలను అందించాడు. అయితే కెప్టెన్ అయినప్పటికీ తాను ఓ సాధారణ బ్యాట్స్ మన్ తరహాలోనే ఆలోచిస్తుంటానని కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్ సమయంలోనే కాదు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తన ఆలోచన తీరు అలాగే ఉంటుందని.. దాంతో ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచి ఫీల్డింగ్ చేయించడం సులభమన్నాడు. బ్రాత్ వైట్ ఔట్ విషయంలో అటాకింగ్ ఫీల్డింగ్ సత్ఫలితాన్ని ఇచ్చిందని, బ్యాట్స్ మన్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే తాను కూడా బ్యాట్స్ మన్ తరహాలో ఆలోచించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్ పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. 560-70 పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంటుందని, అదే విజయానికి బాటలు వేసిందని విరాట్ చెప్పుకొచ్చాడు. కోచ్ అనిల్ కుంబ్లేను ప్రశంసించాడు. అతడు కోచ్ అయ్యాక.. బెంగళూరులో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాం, కరీబియన్ వచ్చాక హార్స్ రైడింగ్, బీచ్ గేమ్స్ స్విమ్మింగ్, టూరిస్ట్ ప్రదేశాలు సందర్శించాం.. ఇలా అన్నీ చేస్తూనే కుంబ్లే శిక్షణలో నిమగ్నమైనట్లు వివరించాడు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, బ్యాట్స్ మన్, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అద్భుత విజయం టీమిండియా సొంతమైందని కోహ్లీ పేర్కొన్నాడు.