హర్షా భోగ్లే
ప్రతీ జట్టుకు పోటాపోటీ విజయాలతో ముందుకెళ్లే అవకాశాలు రావడమే ఐపీఎల్ విజయ సూత్రం. ఈ సీజన్ కూడా దీన్ని నిరూపించింది. లీగ్ మ్యాచ్‌లు ముగిసేవరకు కూడా ప్లే ఆఫ్ బెర్త్ ఆరు జట్ల మధ్య దోబూచులాడింది. అందుకే ఐపీఎల్ ప్రతీ సీజన్‌లో అత్యంత ఆదరణ పొందుతోంది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా.... ఢిల్లీతో బెంగళూరు ఆడబోతున్నాయి. ఇందులో సన్‌రైజర్స్ మినహా అన్నింటికీ గెలుపే లక్ష్యంగా ఉంది. డెక్కన్ చార్జర్స్ పతనం నుంచి పుట్టిన సన్‌కు మంచి వ్యూహ బృందం ఉంది. తమ రిజర్వ్ బెంచ్ పరిమితి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడుతూ టాప్‌లో కొనసాగుతోంది.
కోల్‌కతాకు రస్సెల్ గాయం ఆందోళనపరిచేదే. పిచ్ టర్న్ అయితే కోల్‌కతాకు అవకాశాలుంటాయి. ఇక రాత్రి మ్యాచ్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేసే స్టార్ హిట్టర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉండగా గెరిల్లా తరహాలో పోరాడేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సిద్ధమవుతోంది. రాయ్‌పూర్‌లో బ్యాటింగ్ పిచ్ ఎదురుకానుండడంతో ఢిల్లీ బౌలింగ్ ఓ స్థాయిలో ఉండాల్సిందే. ఛేజింగ్ చేయాల్సి వస్తే మోరిస్, బ్రాత్‌వైట్‌ల ఇన్నింగ్స్ కీలకం. కోహ్లి, డి విలియర్స్‌తోనే ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు వారికి జతగా గేల్ కలిశాడు. పేరుకు ఇది ఢిల్లీకి హోం మ్యాచ్ అయినా ఆర్‌సీబీకే ఎక్కువ మద్దతు లభిస్తుందేమో.
అందుకే ఐపీఎల్‌కు ఆదరణ
Published Sun, May 22 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM
Advertisement