మరో క్రికెటర్కు డీఎస్పీ ఉద్యోగం
సిమ్లా: మహిళల వన్డే ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత క్రికెటర్లపై వరాల జల్లు కురుస్తోంది. ఇప్పటికే హర్మన్ ప్రీత్ కౌర్ కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడానికి పంజాబ్ ప్రభుత్వం ముందుకురాగా, మరో మహిళా క్రికెటర్ సుష్మా వర్మకు సైతం డీఎస్పీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్గా సేవలందిస్తున్న సుష్మాకు డీఎస్పీ హోదా కల్పించనున్నట్లు హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వెల్లడించారు.
సిమ్లాలో 1992, నవంబర్ 3వ తేదీన జన్మించిన సుష్మా.. జాతీయ స్థాయిలో క్రికెట్ కెరీర్ను వికెట్ కీపర్ బ్యాట్స్వుమెన్ గా ఎంచుకుంది. 2011లో అండర్-19 స్థాయిలో జరిగిన మహిళల క్రికెట్ టోర్నమెంట్లో హిమచల్ ప్రదేశ్ కు సుష్మ కెప్టెన్ గా చేశారు. ఆ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ రన్నరప్ గా నిలిచింది. దాంతోపాటు హిమచల్ ప్రదేశ్ తరపున జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్న తొలి క్రికెటర్ సుష్మే కావడం మరో విశేషం. ప్రస్తుతం సుష్మా వర్మ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు.