ఐపీఎల్‌కు ఝలక్
ఏప్రిల్ 30 తర్వాతి మ్యాచ్‌లను
మహారాష్ట్ర నుంచి తరలించండి
► బీసీసీఐకి బాంబే హైకోర్టు ఆదేశం
► ఫైనల్ సహా 13 మ్యాచ్‌లకు అడ్డంకి
ఐపీఎల్-9లో కుదుపు. మహారాష్ట్రలో కరువు, నీటి ఎద్దడి లీగ్‌ను ఊపేసింది. ఓవైపు ప్రాణాలు పోతుంటే.. మరోవైపు ఆటల కోసం పెద్ద మొత్తంలో నీటిని వృథా చేస్తున్నారంటూ చెలరేగిన విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 30 తర్వాత జరగాల్సిన మొత్తం 13 మ్యాచ్‌లను తరలించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది.
ముంబై: ఐపీఎల్-9 మ్యాచ్‌ల తరలింపు అంశంలో బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 30 తర్వాత మహారాష్ర్టలో జరిగే అన్ని మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి ఎద్దడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు తరలించాలని సూచించింది. దీంతో మే 29న జరగాల్సిన ఫైనల్‌తో సహా 13 మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడింది. తరలింపునకు ప్రత్యామ్నాయంగా బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎన్ని హామీలు ఇచ్చినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ‘మహారాష్ట్ర నుంచి మ్యాచ్‌లను తరలించడం సమస్యకు పరిష్కారం కాదనే అంశంతో మేం ఏకీభవిస్తున్నాం.
కానీ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇది తొలి అడుగు అవుతుందనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చాం. నీరు అందుబాటులో లేక కొంత మంది మృత్యువాత పడుతున్నారు. వాళ్ల దురవస్థను కోర్టు విస్మరించజాలదు. కొన్ని జిల్లాలో పారిశుధ్యం, ఇతర అవసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొంది. పిచ్‌ల నిర్వహణ కోసం వాడే శుద్ధి చేసిన (సీవరేజ్) నీటిని అలాంటి చోట్లకు తరలిస్తే బాగుంటుంది. ఇలాంటి కేసుల్లో మ్యాచ్‌లను తరలించడానికి బీసీసీఐగానీ, ఫ్రాంచైజీలుగానీ ముందుకొస్తాయని భావించాం. కానీ వాళ్ల స్పందన మరోలా ఉంది. కాబట్టి మ్యాచ్‌లను తరలించడం తప్ప కోర్టుకు మరో అవకాశం లేకపోయింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అధికారులకు 15 రోజుల సమయం ఇస్తున్నాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
అసలు కేసు ఇదీ!
మ్యాచ్‌ల సందర్భంగా పిచ్‌ల నిర్వహణ కోసం 60 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని లోక్‌సత్తా ఎన్‌జీఓ మూవ్‌మెంట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కనడే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రెండుసార్లు వాయిదా వేసింది. ఈలోగా ముంబైలో తొలి మ్యాచ్ కూడా జరిగిపోయింది. కానీ బుధవారం జరిగిన సుదీర్ఘ విచారణలో కోర్టు మ్యాచ్‌లను తరలించడానికే మొగ్గు చూపింది. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
బీసీసీఐ ప్రతిపాదన
మ్యాచ్‌ల తరలింపుకు ప్రత్యామ్నాయంగా 60 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటిని కరువు పీడిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తామని విచారణలో బోర్డు తర ఫు న్యాయవాది రఫీక్ దాదా ప్రతిపాదించారు. తాము పిచ్‌ల కోసం కేవలం శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగిస్తున్నామన్నారు.అలాగే ముంబై, పుణే ఫ్రాంచైజీలు చెరో రూ. 5 కోట్లను ‘సీఎం కరువు నివారణ నిధి’కి జమ చేస్తాయని చెప్పారు. టోర్నీ మధ్యలో మ్యాచ్‌లను తరలిస్తే ఆర్థికంగా నష్టపోతామని చెప్పినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. జట్ల బ్రాండ్ విలువ, ఆతిథ్య ఫ్రాంచైజీ మ్యాచ్‌ల ఏర్పాట్లకు ఖర్చు చేసిన రూ. 30 కోట్లు వృథా అవుతాయన్న పట్టించుకోలేదు.
ఇలా అయితే ఎలా?
ఐపీఎల్ ఒక్క రాష్ట్రానికే పరిమితంకాదు. దేశంలోని పెద్ద నగరాలన్నీ చాలా మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఎండకాలం కావడంతో దేశంలో ప్రతి చోటా తాగునీటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పిల్ దాఖలైతే బీసీసీఐ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే బెంగళూరులో ఇదే తరహాలో పిల్ దాఖలైంది. కానీ ఇదే ధోరణి కొనసాగితే బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది మిలి యన్ డాలర్ల ప్రశ్న. గతంలో ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేయడంతో బీసీసీఐ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయింది.
మొత్తం 13 మ్యాచ్‌లు...
షెడ్యూల్ ప్రకారం ఈనెల 30 తర్వాత నాగ్‌పూర్‌లో 3, ముంబైలో 4, పుణేలో 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నా యి. ఇందులో ఓ ఎలిమినేటర్, ఓ క్వాలిఫయర్‌తో పాటు ఫైనల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై సందిగ్దత నెలకొంది. ప్రస్తుతానికి బీసీసీఐకి 18 రోజుల సమయం ఉంది. ఈలోగా కొత్త వేదికలను ఎంపిక చేస్తారా లేక హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఇండోర్‌తో పాటు మరో వేదికను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు బోర్డు వర్గాల సమాచారం.
కోల్‌కతా, బెంగళూరు సిద్ధం
ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్‌కు తాము ఆతిథ్యమిస్తామ ని కోల్‌కతా, బెంగళూరు ముందుకొచ్చాయి. అయితే బెంగళూరులో ఓ క్వాలిఫయర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఫైనల్ అవకాశం ఈడెన్‌కే దక్కొచ్చని సమాచారం. మరోవైపు నాగ్‌పూర్‌లో ఆడాల్సిన తమ 3 హోమ్ మ్యాచ్‌లను మొహాలీ లేదా ధర్మశాలలో ఆడాలని పంజాబ్ భావిస్తోంది.
ఐపీఎల్‌ను నిర్వహించడమంటేనే తలకు మించిన పని. ఏర్పాట్లన్నీ ఆరు నెలల ముందే జరిగిపోయాయి. అప్పుడే చెప్పాల్సింది. కానీ మధ్యలో అడ్డుకుంటే మ్యాచ్‌లను తరలించడం సాధ్యంకాదు. కోర్టులంటే మాకూ గౌర వం ఉంది. 13 మ్యాచ్‌లను తరలించడం అంటే మామూలు విషయం కాదు. కొంత మంది ఐపీఎల్‌ను లక్ష్యం గా చేసుకున్నారు.- రాజీవ్ శుక్లా
మేం తాగునీటిని ఉపయోగించుకోవడం లేదు. కేవలం శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడుతున్నాం. ఐదు నక్షత్రాల హోటల్స్‌లో ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ మూతపడ్డాయి? ఎంతమంది తమ పచ్చిక బయళ్లకు నీటిని ఆపేశారు? లీగ్‌పై అపోహలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్‌లకు మేం కేవలం 0.00038 శాతం నీటిని మాత్రమే వాడుతున్నాం. -అనురాగ్ ఠాకూర్ (బీసీసీఐ కార్యదర్శి)