జమ్మూ: విజయంతో గ్రూప్‌లో ఎగబాకాలనుకున్న హైదరాబాద్ ఆశలు ఆవిరయ్యాయి. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. దీంతో గ్రూప్ ‘బి’కి ప్రమోషన్ పొందేందుకు అవకాశాలు దాదాపు అడుగంటాయి. చివరి రోజు ఆటలో హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారు.
రోజంతా బౌలింగ్ చేసి కేవలం ఐదే వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 1) తీయగలిగారు. జమ్మూ కాశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ మాత్రమే కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ 315 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. సొంతగడ్డపై కాశ్మీర్ బౌలర్లు విఫలమైనా... బ్యాట్స్‌మెన్ మాత్రం పోరాడారు. మ్యాచ్‌ను ఓడిపోకుండా కాపాడుకున్నారు.
రాణించిన హర్‌దీప్, బేగ్
చివరి రోజు 198/6 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కాశ్మీర్ జట్టు 93.1 ఓవర్లలో 299 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు స్కోరుకు మరో 101 పరుగులు జోడించింది. ఆఖరి రోజు తొలి ఇన్నింగ్స్‌లో మరో 38.1 ఓవర్లు ఆడటం ద్వారా కాశ్మీర్ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో నిలబడేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ హర్‌దీప్ సింగ్ (175 బంతుల్లో 78, 8 ఫోర్లు), సమీవుల్లా బేగ్ (178 బంతుల్లో 76, 9 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఇద్దరూ జిడ్డుగా ఆడి ఏడో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. అనంతరం వీళ్లిద్దరి నిష్ర్కమణతో కాశ్మీర్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. హైదరాబాద్ బౌలర్ రవికిరణ్ 5 వికెట్లు తీయగా, మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు: హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 514/8 డిక్లేర్డ్; జమ్మూకాశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 299 (రవికిరణ్ 5/53, మెహదీ హసన్ 3/71), రెండో ఇన్నింగ్స్: 127/1.
ఆశలు ఆవిరి!
Published Thu, Dec 26 2013 12:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement