తొమ్మిదేళ్ల ఓ పిల్లాడు టీవీ ముందు కూర్చొని షాహిద్ ఆఫ్రిదినే చూస్తున్నాడు. అతని హెయిర్ స్టయిల్, వికెట్ సెలబ్రేషన్, లెగ్ స్పిన్‌ను తదేకంగా గమనిస్తున్నాడు. ఎందుకో అతనికి ఆఫ్రిది నచ్చాడు. తాను అతనిలా గొప్పవాడిని కావాలనుకున్నాడు. అతన్నే రోల్ మోడల్‌గా ఎంచుకున్నాడు. సరిగ్గా ఆఫ్రిది శైలిలోనే బౌలింగ్ చేయడంతోపాటు ప్రత్యర్థి వికెట్ తీసినపుడు ఆఫ్రిదిలాగే ‘స్టార్ మ్యాన్’ పోజుతో సంబరాలు చేసుకుంటున్నాడు.
బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనీయకుండా వేగంగా బంతులు విసురుతూ ఒత్తిడి పెంచుతున్నాడు. ఇలా మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలి... అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తూ... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అతనే అఫ్ఘానిస్తాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్. రెండు నెలల క్రితం ఐపీఎల్ వేలం సందర్భంగా ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్‌ను పట్టించుకోకుండా 18 ఏళ్ల అఫ్ఘానిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను సన్‌రైజర్స్ ఏకంగా రూ. 4 కోట్లకు తీసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ఆడిన రెండు మ్యాచ్‌లలో చెలరేగి అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. ముఖ్యంగా గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో తీసిన మూడు ఎల్బీడబ్ల్యూ వికెట్లు అతని బౌలింగ్ పదునేమిటో చూపించాయి.
సరదాగా వెళ్లి స్పిన్నర్‌గా...
అఫ్ఘానిస్తాన్‌లోని నంగ్రాహర్ ప్రావిన్స్ రషీద్ స్వస్థలం. క్రికెటర్‌గా నిలదొక్కుకునే సమయంలో రషీద్‌కు సినిమా కష్టాలేం లేవు. ఆర్థికంగా మెరుగైన స్థితిలోనే ఉన్న కుటుంబంలో అతను పుట్టి పెరిగాడు. ఏడుగురు అన్నదమ్ముల్లో ఆరో వాడైన రషీద్‌కు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి పాకిస్తాన్ స్టార్ ఆఫ్రిది స్ఫూర్తినిస్తే అతని సోదరులు ఆటవిడుపుగా తమ్ముడిని గ్రౌండ్‌కు తీసుకెళ్లి క్రికెట్‌లో ఓనమాలు దిద్దించారు. అయితే ఏదో ఆషామాషీగా అతను వెలుగులోకి రాలేదు. రెండేళ్లుగా అఫ్ఘాన్ జట్టు సాధిస్తున్న అద్భుత విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు.
ఇటీవలే ఆ జట్టు వరుసగా 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు గెలిచింది. ఐర్లాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో రషీద్ బౌలింగ్ విన్యాసం (2–1–3–5) చిరస్మరణీయం. 2 ఓవర్లలో కేవలం 3 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టి ఓటమి నుంచి జట్టును గెలుçపు తీరాలకు చేర్చాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో 24 మ్యాచ్‌ల్లో 6.07 ఎకానమీతో 40 వికెట్లను పడగొట్టాడు. అంతే కాకుండా వన్డే క్రికెట్‌లో అతి చిన్న వయసులో (18 ఏళ్ల 185 రోజులు)నే రషీద్ 50 వికెట్లను పడగొట్టడం విశేషం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లు ఈ కుర్రాడిని తమ జట్టులో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక ఐపీఎల్‌లో రాణించడంతో రషీద్ ఏమిటో క్రికెట్ ప్రపంచానికి మరింత బాగా తెలిసింది.
రషీద్‌ను ఎంచుకోవాలనేది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. గత ఆసియా కప్ నుంచి అతని ప్రదర్శనను మేం బాగా పరిశీలించాం. వేలానికి ముందు కరణ్ శర్మను విడుదల చేయడంతో అటాకింగ్ లెగ్‌స్పిన్నర్ మాకు కావాల్సి వచ్చింది. ముస్తఫిజుర్‌లాగే అతడిలో కూడా ఒక ప్రత్యేకత ఉందని మేం భావించాం. ఐపీఎల్‌లో అతడు ఆశ్చర్యకర ఫలితాలు నమోదు చేస్తాడని ఊహించగా, ఇప్పుడు మా నమ్మకం నిజమైంది. – లక్ష్మణ్, సన్‌రైజర్స్ మెంటార్
- సాక్షి క్రీడావిభాగం