పరుగుల ‘వర్షం’ | Run 'rain' | Sakshi
Sakshi News home page

పరుగుల ‘వర్షం’

Published Thu, Jun 11 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

పరుగుల ‘వర్షం’

పరుగుల ‘వర్షం’

బంగ్లా బేబీలను భారత ఓపెనర్లు ఆటాడుకున్నారు. వన్డే తరహా ఆటతీరుతో శిఖర్ ధావన్ సంచలన సెంచరీతో చెలరేగితే... విజయ్ తన ‘శైలి’లో ఆకట్టుకున్నాడు. వెరసి... బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ తొలి రోజే పట్టు బిగించింది. వర్షం కారణంగా ఓవర్లు నష్టపోయినా... ఓపెనర్ల పరుగుల వర్షంతో ఆ లోటు తెలియలేదు. రెండో రోజూ ఇదే దూకుడు కొనసాగిస్తే... కొత్త సీజన్‌ను కోహ్లి సేన విజయంతో ప్రారంభించొచ్చు.

 ఫతుల్లా : ఎంతో మెరుగుపడ్డామని చెప్పుకున్నా...టెస్టుల్లో భారత్ ముందు బంగ్లాదేశ్ బేబీలే అని మరో సారి స్పష్టమైంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మొదటి రోజే భారత్ పట్టు బిగించింది. వర్షం బారిన పడిన ఈ మ్యాచ్ తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (158 బంతుల్లో 150 బ్యాటింగ్; 21 ఫోర్లు), మురళీ విజయ్ (178 బంతుల్లో 89; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా క్రీజ్‌లో నిలిచారు.

వాన కారణంగా లంచ్‌కు ముందు మధ్యలో దాదాపు మూడు గంటలకు పైగా ఆట నిలిచిపోయింది. చివర్లో సెషన్‌ను పొడిగించినా కనీసం 34 ఓవర్లు తగ్గాయి. ఆటగాళ్లకంటే టాస్‌నే ఎక్కువగా నమ్ముకొని బ్యాట్స్‌మన్, పార్ట్‌టైమర్లతో జట్టును నింపేసిన బంగ్లా తగిన ఫలితం అనుభవించింది. రోజంతా ఆడినా కనీసం ఒక వికెట్ తీయలేని బలహీనత మళ్లీ బయటపడింది.

స్కోరు వివరాలు:
 భారత్ తొలి ఇన్నింగ్స్ : విజయ్ (బ్యాటింగ్) 89; ధావన్ (బ్యాటింగ్) 150; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 239.
 బౌలింగ్ : షాహిద్ 12-2-52-0; సర్కార్ 2-0-7-0; షువగత 13-0-47-0; షకీబ్ 9-1-34-0; తైజుల్ 12-0-55-0; జుబేర్ 7-0-41-0; కైస్ 1-0-3-0.
 
 ధావన్ దరహాసం!
 శిఖర్ ధావన్ మరో సారి జట్టులో తన విలువేంటో చూపించాడు. తనకే సాధ్యమైన రీతిలో టెస్టులోనూ వన్డే శైలి ఆటతో చెలరేగి శతకం సాధించాడు. ప్రపంచకప్‌లో బాగా ఆడినా, ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ రాణించినా ఈ టెస్టుకు ముందు తుది జట్టులో ధావన్‌కు స్థానం ఖాయం కాదు. ఆస్ట్రేలియాలో వరుస వైఫల్యాల తర్వాత సిడ్నీ టెస్టుకు దూరమైన అతను, కేఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడంతో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ధావన్ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ.

భీకరంగా దూసుకొచ్చిన తొలి టెస్టు సెంచరీ, తర్వాత న్యూజిలాండ్ గడ్డపై చేసిన శతకంతో పోలిస్తే ఇది గొప్ప కాకపోవచ్చు. కానీ దాదాపు సగం ఆట వర్షం కారణంగా కోల్పోయినా... ధావన్ దూకుడు తొలి రోజే భారీ స్కోరుకు బాటలు వేసింది. ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడు స్లిప్‌లోకి వెళ్లిన బంతి కాస్త వేగవంతమైన మైదానం అయితే నేరుగా ఫీల్డర్ చేతిలో పడేదే. అయితే ఇలా అదృష్టం కలిసొచ్చిన ప్రతీసారి అతను చెలరేగిపోయాడు. చూడచక్కని డ్రైవ్‌లు, ఫ్లిక్‌లతో ఏ మాత్రం తడబాటు లేకుండా సునాయాసంగా శిఖర్ పరుగులు రాబట్టాడు.

బ్యాక్‌ఫుట్‌పై అతను ఆడిన కొన్ని షాట్లు కనువిందు చేశాయి. 73 పరుగుల వద్ద మరో సారి క్యాచ్ మిస్ అయిన తర్వాత అతని జోరు మరింత పెరిగింది. కొద్ది సేపటికే మిడ్ వికెట్ మీదుగా ఫ్లిక్ ప్లస్ స్వీప్ కలగలిపిన కొత్త తరహా షాట్‌తో సెంచరీ చేరిన తీరు డెరైక్టర్ రవిశాస్త్రిని కూడా అబ్బురపరచినట్లుంది. అందుకే డ్రెస్సింగ్‌రూమ్‌నుంచి అదే షాట్‌ను ఆడి చూపించి మరీ ధావన్‌ను అభినందించాడు! శతకం తర్వాత కూడా అతను తన ఏకాగ్రత కోల్పోలేదు. 56 ఓవర్ల ఆటకే 150 మార్క్‌కు చేరితే ...అదే మొత్తం ఆట జరిగితే డబుల్ సెంచరీ కూడా సాధ్యమయ్యేదేమో! అయినా శిఖర్ ముందు మరో అవకాశం ఉంది. రెండో రోజు ఇదే తరహాలో చెలరేగితే కొత్త రికార్డులు ‘గబ్బర్’ ఖాతాలో చేరడం ఖాయం.
 -సాక్షి క్రీడావిభాగం
 
 సెషన్ 1: ఓపెనర్ల శుభారంభం
 టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ టెస్టు ఆడిన జట్టులో ఒకే మార్పు జరిగింది. రాహుల్ స్థానంలో ధావన్‌కు చోటు దక్కగా... ఐదో బౌలర్ కోసం అనూహ్యంగా కోహ్లి... పుజారాను పక్కన పెట్టాడు. భారత జట్టులో ముగ్గురు పేసర్లు ఉండగా, బంగ్లా ఒక పేసర్‌కే స్థానం కల్పించింది. షాహిద్ వేసిన రెండో ఓవర్లో ధావన్‌కు అదృష్టం కలిసొచ్చింది. బ్యాట్ అంచుకు తగిలిన బంతి స్లిప్‌లో ఫీల్డర్ ముందు పడింది. అయితే ఆ తర్వాత ఎక్కడా తగ్గని శిఖర్ దూసుకుపోయాడు.

షువగత ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన అతను, షాహిద్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో వైపు నెమ్మదిగా ఆడిన విజయ్ తన 31వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేకపోయాడు. 73 పరుగుల వద్ద ధావన్‌కు మళ్లీ లైఫ్ లభించింది. తైజుల్ బౌలింగ్‌లో షార్ట్ మిడ్ వికెట్ వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను షువగత వదిలేశాడు. ఆ వెంటనే భారీ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. చాలా సేపటి వరకు తగ్గకపోవడంతో ముందుగానే లంచ్ విరామం ప్రకటించారు.
 
 ఓవర్లు: 23.3, పరుగులు: 107; వికెట్లు: 0
 
 సెషన్ 2: వర్షంతో రద్దు
 వర్షం ఏ మాత్రం తెరిపినివ్వలేదు. ఈ సెషన్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. దాంతో అంపైర్లు టీ బ్రేక్ కూడా ఇచ్చేశారు.
 
 సెషన్ 3: అదే దూకుడు
 ఆట మొదలైన తర్వాత మరోసారి భారత్ పరుగుల వర్షం ఆరంభమైంది. ఏ మాత్రం పస లేని ప్రత్యర్థి బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న ధావన్, విజయ్ ధాటిగా ఆడారు. షాహిద్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన విజయ్ 98 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. వీరిద్దరి ముందు బంగ్లా స్పిన్ ఏ మాత్రం పని చేయలేదు. ఈ క్రమంలో భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. ధావన్, విజయ్ మధ్య 200కు పైగా పార్ట్‌నర్‌షిప్ నమోదు కావడం ఇది రెండో సారి. ఆఖరి బంతికి సింగిల్ తీసి ధావన్ 150 స్కోరుకు చేరిన అనంతరం వెలుతురులేమితో ఆటను నిలిపేశారు. ఇన్నింగ్స్‌లో కేవలం 3 మెయిడిన్ ఓవర్లే వేయగలిగిన బంగ్లాదేశ్, ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వకపోవడం విశేషం.
 
 ఓవర్లు: 32.3, పరుగులు: 132; వికెట్లు: 0

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement