మృత్యువుతో షుమాకర్ పోరాటం | Schumacher critical, outlook uncertain after fall | Sakshi
Sakshi News home page

మృత్యువుతో షుమాకర్ పోరాటం

Published Tue, Dec 31 2013 1:03 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

మృత్యువుతో షుమాకర్ పోరాటం - Sakshi

మృత్యువుతో షుమాకర్ పోరాటం

 ప్రస్తుతం కోమాలోనే..
  రెండు సార్లు బ్రెయిన్ సర్జరీ
  ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు
 
 గ్రెనోబల్ (ఫ్రాన్స్): ఒళ్లు గగుర్పొడిచే వేగంతో ఫార్ములావన్ ట్రాక్‌పై మెరుపులు మెరిపించిన డ్రైవింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నీరాజనాలు అందుకున్న తను... ఆదివారం స్కీయింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఆల్ఫ్స్‌లోని మెరిబెల్ రిసార్ట్‌లో 14 ఏళ్ల తన కుమారుడితో కలిసి స్కీయింగ్ చేస్తుండగా షుమాకర్ తలకు దెబ్బ తగిలింది. అయితే ముందు ఇది మామూలు గాయమే అనుకున్నా హెలికాప్టర్‌లో ఆస్పత్రికి చేర్చేలోపు దాని తీవ్రత పెరిగి షుమాకర్ కోమాలోకి వెళ్లాడు. ప్రాణాలకు హాని లేదని భావించిన డాక్టర్లు ఇప్పుడు అతడి క్షేమంపై పూర్తి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే అతడి మెదడుకు శస్త్ర చికిత్స చేసినట్టు డాక్టర్లు తెలిపారు. పారిస్ నుంచి బ్రెయిన్ స్పెషలిస్ట్, సర్జన్ వచ్చి షుమాకర్ చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. ‘ప్రస్తుతానికైతే షుమాకర్ పరిస్థితి విషమంగా ఉంది. ఓ విధంగా తను మృత్యువుతో పోరాడుతున్నట్టే చెప్పవచ్చు. ప్రమాద సమయంలో అతను హెల్మెట్ ధరించకపోయుంటే ఈపాటికే మరణించేవాడు’ అని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్ జీన్ ఫ్రాంకోయిస్ పయేన్ తెలిపారు. స్విట్జర్లాండ్‌లో నివాసముండే షుమాకర్ విశ్రాంతి కోసం మెరిబెల్‌కు వచ్చినట్టు అతడి అధికార ప్రతినిధి తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1991లో ఎఫ్1లో అరంగేట్రం చేసిన తను అందరికన్నా ఎక్కువగా ఏడుసార్లు ఫార్ములావన్ టైటిళ్లు, 91 రేసులు నెగ్గి చరిత్ర సృష్టించాడు. 2004లో చివరిసారి చాంపియన్‌గా నిలిచిన తను గతేడాది పూర్తిగా రేస్ నుంచి తప్పుకున్నాడు. వచ్చే శువ్రారం తను 45వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు.
 
 ‘త్వరగా కోలుకోవాలి’
 ఎఫ్1 మాజీ రేసర్ షుమాకర్ ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు, రేసర్లతో పాటు జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని వారు కోరుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో తమ ఓదార్పు సందేశాలను ఉంచారు. ‘నీవు అత్యుత్తమమైన వాడివి మైకేల్. ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న స్థితి అత్యంత క్లిష్టమైన రేస్. కానీ దీన్ని కూడా గెలుస్తావని నా  నమ్మకం’ అని ఇటలీ డ్రైవర్ ఫిషిచెల్లా ట్వీట్ చేశాడు. మరోవైపు తన భర్త క్షేమం కోరుకుంటున్న వారందరికీ షుమాకర్ భార్య కొరిన్నా కృతజ్ఞతలు తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement