కోల్‌కతా: వరుస సిరీస్‌లు నిర్వహిస్తూపోతున్న బీసీసీఐ తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కిక్కిరిసిపోయిన షెడ్యూల్ వల్ల దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు తాము తగినంతగా సన్నద్ధం కాలేకపోతున్నామని కోహ్లి తేల్చిచెప్పాడు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన రెండురోజులకే దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా బయలుదేరబోతున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజాగా ఈ విషయంలో కోహ్లికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. క్రికెట్ షెడ్యూల్ విషయంలో కోహ్లి ఆవేదన నిజమేనని అన్నాడు. ‘క్రికెట్ షెడ్యూల్ కోసం కోహ్లి వ్యాఖ్యలు సరైనవే. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు జట్టు సన్నద్ధమవ్వడానికి తగినంత సమయం ఇవ్వాలి’ అని గంగూలీ సూచించాడు.
‘దురదృష్టవశాత్తూ శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత రెండు రోజులకే మేం దక్షిణాఫ్రికా బయల్దేరాల్సి ఉంది. కాబట్టి రాబోయే సిరీస్ గురించి ఆలోచించి దానికి అనుగుణంగా ఇక్కడే అలాంటి పరిస్థితుల్లో ఆడటం మినహా మాకు మరో ప్రత్యామ్నాయం లేదు. కనీసం మాకు నెల రోజుల విరామం ఉంటే ప్రత్యేక శిబిరంలో ఆ సిరీస్‌కు తగిన విధంగా సన్నద్ధమయ్యేవాళ్లం. కాబట్టి మాకు అందుబాటులో ఉన్న దాంట్లోనే అంతా చేసుకోవాల్సి వస్తోంది. సమయం లేకపోవడం గురించి మున్ముందు చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విదేశీ పర్యటనల్లో జట్టు ప్రదర్శనను విశ్లేషించేందుకు అంతా సిద్ధమైతాం. కానీ అక్కడ ఆడే ముందు ఎన్ని రోజులు సన్నద్ధం అయ్యామనేది ఎవరూ చూడరు’ అని కోహ్లి తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కోహ్లి వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన బీసీసీఐ.. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment