యువీకి అర్హత ఉంది
కోల్‌కతా: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు భారత జాతీయ జట్టులో చోటు సంపాదించే అర్హత ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బ్యాటింగ్‌లో ఫామ్‌లోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నాడు. ‘యువీ గాడిలో పడటం గొప్ప విషయం. అతను జట్టులోకి పునరాగమనం చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండొందల శాతం అతనికి ఆ అర్హత ఉంది. మిడిలార్డర్‌లో యువీ కచ్చితంగా ఉండాలి.
దినేశ్ కార్తీక్‌కు కూడా స్థానం ఇవ్వాల్సిందే. అయితే నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌గా యువీకే ఎక్కువ అర్హత ఉంది’ అని దాదా పేర్కొన్నాడు. స్వదేశంలో ఆసీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఈనెల 30న భారత జట్టును ఎంపిక చేయనున్నారు. 200వ టెస్టు తర్వాత రిటైరయ్యే విషయంపై చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్, సచిన్‌ల మధ్య చర్చ జరిగినట్లు వచ్చిన కథనాలపై స్పందించేందుకు నిరాకరించాడు. తనతోపాటు లక్ష్మణ్, ద్రవిడ్‌లపై కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు వినిపించాయని చెప్పాడు.
సచిన్ కెరీర్‌ను పొడిగించుకునే అవకాశంపై మాట్లాడుతూ... ‘ఇంకా ఆడగలనని మాస్టర్‌లాంటి దిగ్గజ ఆటగాళ్లకు నమ్మకం ఉంటే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా వెళ్తాడు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 40 ఏళ్ల వయసులో లియాండర్ పేస్ 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలిచాడు. అయితే సచిన్ ఆడేది టీమ్ తరఫున కాబట్టి అతని సలహా మేరకు సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా ఆట పరంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు రిటైర్ కావాలని మా భావన’ అని ఈ కోల్‌కతా దిగ్గజం వెల్లడించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్... తిరిగి జట్టులోకి రావడం చాలా కష్టమని స్పష్టం చేశాడు.