సఫారీ... మళ్లీ నంబర్‌వన్‌ | South Africa Complete Clean Sweep Over Sri Lanka, Reclaim No.1 ODI Ranking | Sakshi
Sakshi News home page

సఫారీ... మళ్లీ నంబర్‌వన్‌

Published Sun, Feb 12 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

సఫారీ... మళ్లీ నంబర్‌వన్‌

సఫారీ... మళ్లీ నంబర్‌వన్‌

శ్రీలంకపై వన్డే సిరీస్‌ 5–0తో క్లీన్‌స్వీప్‌
26 నెలల తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి
చివరి వన్డేలో 88 పరుగులతో గెలుపు
ఆమ్లా, డి కాక్‌ సెంచరీలు


సెంచూరియన్‌: ఒకే విజయంతో దక్షిణాఫ్రికా జట్టు రెండు లక్ష్యాలను అధిగమించింది. శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 88 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేయడమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 26 నెలల తర్వాత మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 384 పరుగులు సాధించింది.

ఓపెనర్లు క్వింటన్‌ డి కాక్‌ (87 బంతుల్లో 109; 16 ఫోర్లు), హషీమ్‌ ఆమ్లా (134 బంతుల్లో 154; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 187 పరుగులు జోడించారు. డు ప్లెసిస్‌ (34 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బెహర్దీన్‌ (20 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. లంక బౌలర్లలో సురంగ లక్మల్‌ మూడు, లాహిరు మధుశంక రెండు వికెట్లు పడగొట్టారు.

385 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసి ఓటమి పాలైంది. అసేలా గుణరత్నె (117 బంతుల్లో 114 నాటౌట్‌; 14 ఫోర్లు, 2 సిక్స్‌ల) అజేయ సెంచరీ చేయగా... సచిత్‌ పతిరాణా (62 బంతుల్లో 56; 6 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను గుణరత్నె, పతిరాణా ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం వెంటవెంటనే శ్రీలంక మూడు వికెట్లను కోల్పోయింది.

ఈ దశలో లక్మల్‌ (28 బంతుల్లో 20 నాటౌట్‌)తో కలిసి గుణరత్నె తొమ్మిదో వికెట్‌కు 97 పరుగులు జత చేసి లంకను ఆలౌట్‌ కాకుండా చేశాడు. కానీ పరాజయాన్ని మాత్రం తప్పించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌ నాలుగు వికెట్లు తీయగా, పార్నెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆమ్లాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ పురస్కారం లభించగా... డు ప్లెసిస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కింది.

సిరీస్‌కు ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తాజా సిరీస్‌ విజయంతో 119 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్‌ చేతిలో 0–2తో సిరీస్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. 113 పాయింట్లతో న్యూజిలాండ్‌ మూడో స్థానంలో, 112 పాయింట్లతో భారత్‌ నాలుగో స్థానంలో, 107 పాయింట్లతో ఇంగ్లండ్‌ ఐదో స్థానంలో ఉన్నాయి. చివరిసారి దక్షిణాఫ్రికా 2014 నవంబరులో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచింది. అదే నెలలో భారత్‌ 5–0తో శ్రీలంకను ఓడించి టాప్‌ ర్యాంక్‌ పొందింది.

అదే నెల చివర్లో ఆస్ట్రేలియా 4–1తో దక్షిణాఫ్రికాపై గెలిచి భారత్‌ నుంచి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. గత 26 నెలలుగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా... దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. 2002లో ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టాక దక్షిణాఫ్రికా నంబర్‌వన్‌గా నిలువడం ఇది ఐదోసారి. ఈనెల 19న న్యూజిలాండ్‌తో మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెల్చుకుంటే టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆస్ట్రేలియాకు టాప్‌ ర్యాంక్‌ దక్కుతుంది.


24.వన్డే మ్యాచ్‌ల్లో 350 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం దక్షిణాఫ్రికాకిది 24వ సారి. గతంలో భారత్‌ 23 సార్లు ఇలా చేసింది.

14.సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకిది వరుసగా 14వ విజయం.

50.అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమ్లా 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడుగురు క్రికెటర్లలో ఆమ్లా ఒక్కడే తక్కువ (348) ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.

6.దక్షిణాఫ్రికా ఆరుసార్లు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement