అవకాశం 'జారవిడిచాడు'
ధోనివల్ల భారత్‌లో వికెట్ కీపింగ్ కెరీర్‌గా ఎంచుకున్నవాళ్లందరికీ నిరాశే.... కొంతకాలం క్రితం వినిపించిన వ్యాఖ్య ఇది. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా, ఆ తర్వాత కెప్టెన్‌గా జట్టులో ధోని స్థానం సుస్థిరమైంది.
దీంతో దేశంలో మిగిలిన కీపర్లంతా నిరాశ చెందారు. కానీ ధోని లేని సమయంలో వచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకోలేకపోయారు. తాజాగా ఆసియా కప్‌లో దినేశ్ కార్తీక్ కూడా ధోనిని మరిపించలేకపోయాడు. ఏకంగా రెండు మ్యాచ్‌ల్లో సులభమైన స్టంపింగ్ అవకాశాలను వదిలేసి భారత్ ఆసియాకప్ ఫైనల్ ఆశలను క్లిష్టం చేశాడు.
క్రీడావిభాగం
గత ఐదేళ్లలో ధోని జట్టులో లేకుండా భారత్ ఆడిన మ్యాచ్‌లను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. ఎప్పుడైనా కెప్టెన్ అందుబాటులో లేకపోతే సాహా, పార్థీవ్, కార్తీక్‌లలో ఒకరు జట్టులోకి రావాలి. ఇలాంటి స్థితిలో దినేశ్ కార్తీక్‌కు మిగిలిన వాళ్లకంటే ఎక్కువగానే అవకాశాలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ధోని జట్టులో ఉన్నా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా కూడా కార్తీక్‌ను ఆడించారు. కానీ ప్రస్తుత ఆసియాకప్‌లో అతడి ఆట చూస్తుంటే... అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ రాణించలేక రెంటికి చెడినట్లుగా కనిపిస్తున్నాడు. అరుదుగా వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వరుసగా విఫలమవుతున్నాడు. ఇక మరో చెత్త ప్రదర్శనతో కార్తీక్ కెరీర్ కూడా ప్రమాదంలో పడవచ్చు.
సునాయాస అవకాశాలు...
శ్రీలంకతో మ్యాచ్‌లో సంగక్కరను 30 పరుగుల వద్ద స్టంప్ చేయడంలో కార్తీక్ విఫలమయ్యాడు. ఫలితంగా సంగ సెంచరీతో జట్టును గెలిపించాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో చెత్త షాట్ ఆడి నిష్ర్కమించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కీలక దశలో మఖ్సూద్‌ను స్టంప్ చేసే సునాయాస అవకాశాన్ని కార్తీక్ జారవిడిచాడు. ఆ తర్వాత హఫీజ్‌తో కలిసి అతను మరికొన్ని పరుగులు జోడించడం ఫలితంపై ప్రభావం చూపింది. ఇక బ్యాటింగ్‌లోనే భారత్ స్కోరు 103/4గా ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన అతను భారీ భాగస్వామ్యం అవసరమైన దశలో బాధ్యతారహిత షాట్ ఆడి వెనుదిరిగాడు.
ఈ రెండు ప్రదర్శనలు దినేశ్ కార్తీక్ కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. స్టార్ క్రికెటర్ ధోని లేని సమయంలో మరింత బాగా కీపింగ్ చేయాల్సిన, బ్యాటింగ్‌లో రాణించాల్సిన కార్తీక్ చేజేతులా ఈ అవకాశాలు పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అద్భుతమైన స్ప్రింట్ లక్షణాలతో కీపింగ్ చేసిన దినేశ్, ఇప్పుడు సాధారణంగా మారిపోయాడు. అన్నింటికి మించి జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేయలేకపోవడం ఆసియా కప్‌లో భారత్ అవకాశాలను దెబ్బ తీసింది.
జట్టులో అనుభవజ్ఞుడే...
ఆసియా కప్‌లో ఆడుతున్న భారత జట్టులో చాలా మందితో పోలిస్తే దినేశ్ కార్తీక్‌కు మంచి అనుభవం ఉంది. దాదాపు పదేళ్ల క్రితమే అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. కెరీర్‌లో 70 వన్డేలు, 23 టెస్టులు ఆడాడు. ధోని సమకాలికుడు కావడం కార్తీక్‌కు ప్రతికూలంగా పరిణమించినా, చాలా అవకాశాలు అతనికి దక్కాయి. సెలక్టర్లు కూడా అతని ప్రతిభకు తగిన గుర్తింపునిచ్చారు. తన కెరీర్‌లో అతను 42 వన్డేలు, 7 టెస్టుల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా భారత్ తరఫున బరిలోకి దిగాడు. 42 మ్యాచుల్లో అతను టాప్-5 స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాడు. అందులోనూ 20 సార్లు ఓపెనింగ్ చేసే అవకాశం దక్కింది. అయినా సరే కార్తీక్ పెద్దగా పురోగతి సాధించలేకపోయాడు. ఇన్ని అవకాలు దక్కినా అతని సగటు 27. 48 మాత్రమే. స్ట్రైక్ రేట్ (73.15) కూడా ఘనంగా ఏమీ లేదు.
మళ్లీ చోటుందా...
సెప్టెంబర్ 2009 నుంచి ఆగస్టు 2010 వరకు 17 ఇన్నింగ్స్‌లలో కార్తీక్ కేవలం రెండు అర్ధ సెంచరీలే చేశాడు. వరుసగా మూడు మ్యాచుల్లో 9, 0, 0 పరుగులు చేయడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దాదాపు మూడేళ్లు అతను టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అయితే 2012-13 రంజీ సీజన్‌తో పాటు ఐపీఎల్‌లో బాగా ఆడటంతో అతనికి చాంపియన్స్ ట్రోఫీకి పిలుపు లభించింది. యువరాజ్ స్థానంలో ఆడుతూ వార్మప్ మ్యాచ్‌లలో సెంచరీలు చేసినా...15 వన్డేల్లో రెండే అర్ధ సెంచరీలు చేయడంతో మళ్లీ స్థానం కోల్పోయాడు. ధోని గాయంతో అదృష్టవశాత్తూ చోటు దక్కినా ఆకట్టుకోలేకపోయాడు. మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తనదైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లోనూ అతను జట్టుతో పాటు పర్యటించాడు. అయితే అతనికి దక్కని అదృష్టం కార్తీక్‌కు లభించింది. కానీ కార్తీక్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. భారత్ తరఫున 2 టెస్టులు, 3 వన్డేలు ఆడిన సాహాకు దేశవాళీలో మంచి రికార్డు ఉంది. ఈ రంజీ సీజన్‌లో అతను 6 మ్యాచుల్లో 65.77 సగటుతో 592 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అద్భుతంగా రాణిస్తేనే కార్తీక్‌కు టీమిండియాలో చోటు లభిస్తుంది.