మారిన కేజ్రీవాల్ అడ్రస్
మారిన కేజ్రీవాల్ అడ్రస్
Published Sat, Feb 1 2014 11:06 PM | Last Updated on Wed, Oct 17 2018 4:13 PM
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శనివారం తన నివాసాన్ని ఢిల్లీకి మార్చారు. ఆయన చిరునామా కౌశంబీలోని సొంత ఇంటి నుంచి సెంట్రల్ ఢిల్లీలోని తిలక్‌లేన్‌లో గల ప్రభుత్వ క్వార్టరుకు మారింది. శనివారం కౌశంబీ ఇంటి నుంచి తిలక్‌లేన్‌కు ఇంటి సామాన్లన్నీ తరలించారు. కౌశంబీలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారుల సొసైటీ నిర్మించిన గిర్నార్ టవర్స్‌లో కేజ్రీవాల్ 1995 నుంచి నివసముంటున్నారు. ఐఆర్‌సీ అధికారిణి అయిన కేజ్రీవాల్ సతీమణి సునీత పేరట ఆ ఇంటిని కేటాయించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తరువాత పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆయనకు తిలక్‌లేన్‌లో క్వార్టర్ కేటాయించింది. అంతకుముందు తనకు కేటాయించిన పెద్ద బంగ్లాను కేజ్రీవాల్ స్వీకరించడానికి నిరాకరించడంతో ప్రభుత్వం ఆయనకు టైప్ ఆరు క్వార్టరును కేటాయించింది.
కేజ్రీవాల్ తన మకాం ఢిలీకి మార్చడంతో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కౌశాంబిలోని ఆయన నివాసానికి కల్పించిన ‘జడ్’ కేటగిరీ రక్షణ వ్యవస్థను త్వరలో ఉపసంహరించుకోనున్నారు. ప్రస్తుతం కౌశాంబిలోని కేజ్రీవాల్ నివాసం వద్ద నిత్యం 30 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. తిలక్‌లేన్‌లో నివసించే ఓ మంత్రి లేదా, వీవీఐపీకి నిబంధనల ప్రకారం భద్రత కల్పించడం తమ బాధ్యత అని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ధర్మేంద్ర సింగ్ చెప్పారు. తిలక్‌లేన్‌కు ముఖ్యమంత్రి తన నివాసాన్ని మార్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపి, అక్కడ ‘జడ్’ కేటగిరీ రక్షణ వ్యవస్థ కల్పిస్తామని అన్నారు. కేజ్రీవాల్‌కు కల్పించిన భద్రతను ఉపసంహిరంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Advertisement