నేడు బీజేపీ కార్యాచరణ సమావేశం
బెంగళూరు: 2018లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ దిశగానే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు నేడు(శనివారం) పార్టీ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించనున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పతో పాటు కేంద్ర మంత్రులు అనంతకుమార్, డి.వి.సదానందగౌడ, జి.ఎం.సిద్ధేశ్వర్, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా సీతారామన్, పార్టీ నేతలు జగదీష్ శెట్టర్, కె.ఎస్.ఈశ్వరప్ప, ఆర్.అశోక్‌తో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు మొత్తం 450 మంది పాల్గొననున్నారు.
బి.ఎస్.యడ్యూరప్ప బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం జరుగుతున్న సమావేశం కావడంతో ఈ సమావేశంలో అనేక ప్రముఖ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.