కొత్త సీసాలో పాత సారా
Published Wed, Apr 2 2014 11:03 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడింటికి ఏడు సీట్లు గెలవాలనుకుంటున్న బీజేపీ ఢిల్లీ కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. జాతీయ స్థాయి మేనిఫెస్టోను పార్టీ ఇంతవరకు జారీ చేయనప్పటికీ ఢిల్లీ బీజేపీ మాత్రం నగరం కోసం ప్రత్యేక మానిఫెస్టోను రూపొందించి బుధవారం విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన సీనియర్ బీజేపీ నేతలు, ఏడు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల సమక్షంలో పార్టీ మానిఫెస్టోను విడుదల చేశారు. కొత్త సీసాలో పాతసారా చందంగా ఉన్న ఈ మేనిఫెస్టోలో అన్నీ పాత హమీలో దర్శనమివ్వడం విశేషం.
ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానిగా, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్చించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా బీజేపీ ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కావాలంటోందని, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్పప్పుడు ఇందుకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టారని, కానీ సెలక్ట్ కమిటీ సకాలంలో నివేదిక సమర్పించనందువల్ల బిల్లు చట్టరూపం దాల్చలేకపోయిందని ఆయన చెప్పారు. ఢిల్లీ వాసులు ఇళ్ల కప్పులపై సోలార్ పానెల్స్‌ని అమర్చుకోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీని సౌరశక్తి రాజధానిగా తీర్చిదిద్దాలని కూడా బీజేపీ ఆశిస్తోందని హర్షవర్ధన్ తెలిపారు.
విద్యుత్తు చార్జీలను 30 శాతం తగ్గిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆయన పునరుద్ఘాటించారు. డిస్కంలను ఆర్‌టిఐ చట్టం, సీఏజీ కిందకు తెస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ధరలను నియంత్రిస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త విధానం ప్రవేశపెడతామని, జెనరిక్ ఔషధాలను ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఢిల్లీ పోలీస్, డీడీఏ తదితర సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామన్నారు. యమునా నది శుద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement